మెట్రో, ఎల్ అండ్ టీ అధికారులపై కిషన్ రెడ్డి మండిపడ్డారు..!

13

హైదరాబాద్ మెట్రో మూడో మార్గం జేబీఎస్- ఎంజిబిఎస్ ప్రారంభానికి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డిని పిలవక పోవడం చినికి చినికి గాలివానలా మారుతోంది. ఇప్పటికే ఈ అంశంలో తీవ్ర ఆగ్రహంతో ఉన్న కిషన్ రెడ్డి ఈ మధ్యాహ్నం మెట్రో, ఎల్ అండ్ టీ అధికారులతో సమావేశమయ్యారు. మెట్రో, ఎల్ అండ్ టీ అధికారులపై సమావేశంలో కిషన్ రెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. మొత్తం కార్యక్రమం సికిందరాబాద్ నియోజకవర్గంలోనే జరిగితే స్థానిక ఎంపినైన తనకి చెప్పరా అని కిషన్ రెడ్డి అధికారులని నిలదీశారు. మొత్తం టీఆర్ఎస్ ఫంక్షన్ లా చేస్తారా అని ప్రశ్నించారు.

మెట్రో రైలుకి కేంద్రం నిధులు ఇస్తుంది. కానీ ప్రధాని ఫొటో ఎక్కడా కనిపించదు., నా ఫొటో కనిపించక పోయినా ఫర్వాలేదు అని కిషన్ రెడ్డి అన్నారు. తనకి పార్టీ తరపున విప్ ఉందని కాబట్టి పార్లమెంటులో ఉండాల్సి వచ్చిందని కిషన్ రెడ్డి తెలిపారు. ఒక్క రోజు ముందు మాత్రమే ఎలా సమాచారం ఇచ్చారని అధికారులపై ఆయన మండిపడ్డారు. హైదరాబాద్ మెట్రో నిర్మాణానికి కేంద్రం ఇప్పటిదాకా 1250 కోట్లు ఇచ్చిందని, ఇంకా రెండు వందల కోట్లు ఇవ్వాల్సి ఉందని కిషన్ రెడ్డి గుర్తు చేశారు. ఇప్పుడా రెండు వందల కోట్ల విడుదల సంగతి చూస్తానని కిషన్ రెడ్డి హెచ్చరించారు.