సిరిసిల్ల సిఐ అక్రమ లోగుట్టు..!

63

తెలంగాణ రాష్ట్ర యువ నేత కేటీఆర్ సొంత జిల్లా రాజన్న సిరిసిల్ల జిల్లాలో సంచలన పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. జిల్లా కేంద్రమైన సిరిసిల్ల పట్టణ సిఐ శ్రీనివాస్ చౌదరి ఆగడాలకు అడ్డు అదుపు లేకుండా పోతున్నాయని స్థానిక ప్రజలు వాపోతున్నారు. భూ దందాలు, సెటిల్ మెంట్లు, సివిల్ మ్యాటర్లలో తల దూర్చి బెదిరించటం, ఇసుక మాఫియాతో కలిసి అక్రమ రవాణ ని ప్రోత్సహించటం, స్థానిక వ్యాపారుల దగ్గర మామూళ్లు వసూలు చేయటం… ఇలాంటి అక్రమ కార్యకలాపాలు చేస్తూ స్థానిక నేతల సహకారంతో ఈ ఖాకికి అక్రమాలకు అడ్డు చెప్పేవారే కరువయ్యారని కొందరు గగ్గోలు పెడుతున్నారు.

ఇటీవల కాలంలో సిరిసిల్లకు చెందిన ఒక బడా సామాజిక వర్గానికి చెందిన వ్యక్తికి సంబంధించిన సిరిసిల్ల బైపాస్ రోడ్ లోని స్థలంపై కన్నేసిన ఆ సిఐ ఆ స్థల యజమానిని బెదిరించి వేరే వ్యక్తికి అతి తక్కువ ధరలో అమ్మేలా చేశాడని, ఆ స్థలం విషయంలో వీపరీతంగా జోక్యం చేసుకొని తన అధికారాన్ని ఉపయోగించి ఆ స్థల యజమానిని ముప్పుతిప్పలు పెట్టాడని స్థానికంగా అనుకుంటున్నారు. ఏది ఏమైనా రాష్ట్రంలోనే కీలక నేత కేటీఆర్ నియోజకవర్గంలో ఈ సిఐ ఇలా చేయటం స్థానిక ప్రజల్లో తీవ్ర అనుమానాలను కలగజేస్తుంది. ఇప్పటికైనా పొలిసు ఉన్నతాధికారులు సిరిసిల్ల పట్టణ సిఐ విషయంలో జోక్యం చేసుకొని ఈ ఖాకి అక్రమాలకు అడ్డుకట్ట వేయాలని ప్రజలు కోరుతున్నారు.

ఇదివరకే సిరిసిల్ల నియోజకవర్గంలో జరిగిన నేరెళ్ల ఇసుక అక్రమ రవాణ సంఘటన కేటీఆర్ ను రాజకీయంగా చాల ఇబ్బందులకు గురిచేసింది. ఆ సంఘటన రాష్ట్రాన్నే ఒక కుదుపు కుదిపింది. అప్పుడు ఆ సంఘటనలో సాక్ష్యాత్తు జిల్లా ఎస్పీనే బదిలీ చేసి, లోకల్ అధికారులను సస్పెండ్ చేసి రాష్ట్ర ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు చేపట్టింది. ఏది ఏమైనా ఈ సదరు సిఐ దందాలు, దౌర్జన్యాలు మంత్రి గారికి, జిల్లా పోలీస్ బాసులకు తెలియకుండానే జరుగుతున్నాయా అని ప్రజలు చర్చించుకుంటున్నారు