టీఎస్‌ ఆర్టీసీ సమ్మెపై పవన్‌ స్పందన

294

హైదరాబాద్‌: తెలంగాణ ఆర్టీసీలో కార్మికుల తొలగింపు నిర్ణయం ఆందోళనకరమని జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ అన్నారు. తమ డిమాండ్ల సాధన కోసం కార్మికులు చేసే ఆందోళనలను ప్రభుత్వాలు సానుభూతితో అర్థం చేసుకుని పరిశీలించాలే తప్ప కఠినమైన నిర్ణయాలు తీసుకోవడం తగదని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ మేరకు జనసేన పార్టీ ఓ ప్రకటన విడుదల చేసింది.

JanSena Pawan Kalyan Responds over KCR Decision on TSRTC Strike | Prime9 News

”ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని డిమాండ్ చేస్తూ చేపట్టిన సమ్మె సందర్భంగా 1200 మందిని తప్ప మిగతా వారందర్నీ తొలగించనున్నట్లు వస్తున్న వార్తలు కలవరానికి గురి చేస్తున్నాయి. తెలంగాణ ఉద్యమంలో సకల జనుల సమ్మెలో భాగంగా పదిహేడు రోజులపాటు ఆర్టీసీ ఉద్యోగులు నిరసన కార్యక్రమాలు చేపట్టి ఉద్యమానికి అండగా ఉన్నారు. వారు చేసిన త్యాగాన్ని ఈ సందర్భంగా మనం గుర్తు చేసుకోవాల్సి ఉంది. ప్రస్తుతం అటు ప్రభుత్వం, ఇటు ఉద్యోగ సంఘాలు సంయమనం పాటించి చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలి. ప్రజలకు కష్టం కలగకుండా చూడాల్సిన బాధ్యత మనందరిపైనా ఉంది. ఉద్యోగుల పట్ల ఉదారత చూపి ఆర్టీసీ సమ్మెను సామరస్యంగా పరిష్కరించాలని సీఎం కేసీఆర్‌ను కోరుతున్నాను” అని పవన్‌ పేర్కొన్నారు.