ఇస్త్రీ పెట్టెల్లో 9.5 కిలోల బంగారం ..!

59

బంగారం రేటు భారీగా పెరిగిపోతోంది. 10 గ్రాముల గోల్డ్ రేట్ 38వేలకు చేరుకోవడంతో వినియోగదారులు బెంబేలెత్తిపోతున్నారు. అయితే..స్మగ్లర్లు మాత్రం కళ్లుగప్పి బంగారాన్ని అక్రమమార్గంలో తరలిస్తున్నారు. శంషాబాద్ లో ఇలాగే చేస్తూ దొరికిపోయాడో ఓ ప్యాసింజర్. 9.5 కిలోల బంగారాన్ని తరలిస్తున్న ఇతడిని కస్టమ్స్, ఇంటెలిజిన్స్ అధికారులు పట్టుకున్నారు. 

శంషాబాద్ విమానాశ్రయంలో స్మగ్లింగ్ అరికట్టడానికి అధికారులు ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా పరిస్థితిలో మార్పు రావడం లేదు. అధికారులకు దొరకకుండా వినూత్నంగా బంగారాన్ని తరలించే ప్రయత్నం చేస్తున్నారు. 2019, ఆగస్టు 10వ తేదీ శనివారం దుబాయ్ నుంచి వచ్చిన ఓ వ్యక్తిని అధికారులు తనిఖీలు చేశారు.

ఐరన్ బాక్సులపై వారికి అనుమానం కలిగింది. వాటిని చెక్ చేయగా 9.5 కిలోల బంగారం బయటపడింది. వీటి విలువ మార్కెట్ లో రూ. 3.5 కోట్లుగా ఉంటుందని అంచనా. అయితే..అక్కడి నుంచి ప్రయాణికుడు మెల్లిగా జారుకుంటుండగా అధికారులు అప్రమత్తమై పట్టుకున్నారు.