కేసీఆర్‌కు మళ్లీ షాక్‌…

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు మరో షాక్ తగిలింది. హైకోర్ట్ ప్రభుత్వానికి ఝలక్ ఇచ్చింది. కొత్త సచివాలయం, హైకోర్టు నిర్మాణం విషయంలో తమ నిర్ణయం పాటించాల్సిందేనని స్పష్టం చేసింది. ప్రస్తుత భవనాలను కూల్చివేసి నూతన నిర్మాణాలను చేపట్టడం తగదని హైకోర్టులో వేసిన పిటిషన్‌పై నేడు విచారణ జరిగింది. ఈ సందర్భంగా 15రోజుల్లో ఎర్రమంజిల్ సచివాలయ నిర్మాణాలపై కౌంటర్ దాఖలు చేస్తామని ప్రభుత్వతరపు న్యాయవాది తెలిపారు. అలాగైతే కోర్టు ఉత్తర్వులు వెల్లడించే వరకు ఇప్పట్లో సెక్రటేరియట్ నిర్మాణం, ఎర్రమంజిల్ కూల్చివేతపై ఎలాంటి చర్యలు చేపట్టోద్దని తెలిపింది హైకోర్ట్. వెంటనే వెనక్కి తగ్గి మధ్యాహ్నం వరకు కౌంటర్ చేస్తామని ప్రభుత్వ తరపు న్యాయవాది చెప్పారు.

మధ్యాహ్నం కౌంటర్ దాఖలు చేసి వాదనలు వినిపిస్తామని ప్రభుత్వం చెప్పడంతో.. కేసును మధ్యాహ్నానికి హైకోర్టు వాయిదా వేసింది. అనంతరం వాదనలు వింటూ, ఎర్రమంజిల్, సచివాలయ భవనాల కూల్చివేతలపై విచారణ బుధవారానికి వాయిదా వేసింది. ఈ కేసు తేలేంత వరకు భవనాలు కూల్చవద్దని మరోసారి హైకోర్టు స్పష్టం చేసింది. హైకోర్టు ఆదేశాలను ప్రభుత్వానికి తెలియజేస్తామని అడిషనల్ అడ్వకేట్ జనరల్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం 2014 ప్రకారం ఉమ్మడి రాజధాని లోని హైదరాబాద్ లోని ప్రభుత్వ కట్టడాలపై గవర్నర్ నిర్ణయాధికారం ఉంటుందని కోర్టుకు పిటిషనర్ తెలిపారు. సెక్షన్ 8 (2)(3) ప్రకారం భవనాలు శాంతి భద్రతలపై ఉమ్మడి రాజధానిలో గవర్నర్‌కే అధికారం ఉంటుందని పిటిషనర్ తెలిపారు. చారిత్రక ,వారసత్వ,సాంస్కృతిక కట్టడాలు 100 ఏళ్ళ దాటితే వాటిని కూల్చడానికి వీల్లేదని కోర్టుకు పిటిషనర్ తెలిపారు.

100 ఏళ్ళు దాటినా కట్టడాలను జాతీయ వారసత్వ సంపదగా పరిగణించాలని, డైరెక్టరేట్ ఆర్కియాలజిగాని ఎర్రమంజిల్‌ను జాతీయ సంపదగా గుర్తించిందా అని హైకోర్టు ప్రశ్నించింది. అలాంటి వివరాలు ప్రస్తుతం మంచు తమ వద్ద లేవని తర్వాత పూర్తి వివరాలు సమర్పిస్తామని పిటిషనర్ తెలిపారు. గూగుల్ మ్యాప్‌ను మరో సారి హైకోర్టు పరిశిలించింది. ఉమ్మడి రాష్ట్రంలో సరిపోయిన భవనాలు ఇప్పుడు ఎందుకు సరిపోవడం లేదన్న పిటిషనర్ ప్రజాధనం దుర్వినియోగం చేసేందుకే నూతన భవనాలను నిర్మిస్తున్నారని ఆరోపించారు. తదుపరి విచారణను బుధవారానికి హైకోర్టు వాయిదా వేసింది.