లాడ్జిలో ప్రేమ జంట ఆత్మహత్య..!

హైదరాబాద్‌లోని ఓ లాడ్జిలో  ప్రేమ జంట ఆత్మహత్య కలకలం రేపుతోంది. చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని వీవీ ప్రైడ్ లాడ్జిలో రెండు రోజుల క్రితం ఓ ప్రేమ జంట దిగింది. ఆ వెంటనే విషం తాగి వీరు ఆత్మహత్య చేసుకున్నారు. గది అద్దెకు తీసుకున్నప్పటి నుంచి వీరు బయటకు రాకపోవడంతో లాడ్జి యాజమాన్యం అనుమానించి పోలీసులకు సమాచారం అందించింది.

వారొచ్చి తలపులు బద్దలుగొట్టి చూడగా యువజంట విగతజీవులుగా పడి ఉన్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను ఆసుపత్రికి తరలించారు. కాగా, వీరిని నల్గొండ జిల్లా  కొరతాండ చిల్లాపురం గ్రామానికి చెందిన కొర్రా మోహన్‌ నాయక్‌(25), అదే ప్రాంతంలోని  శ్రీనివాసనగర్‌ కాలనీలో నివసించే స్వర్ణలత(21)గా గుర్తించారు.

యువకుడు ఎల్బీనగర్‌లో ఉంటూ క్యాబ్‌ డ్రైవర్‌గా పనిచేస్తుండగా, యువతి బీటెక్ పూర్తి చేసింది. రెండేళ్లుగా ప్రేమించుకుంటున్న వీళ్లిద్దరూ తమ ప్రేమను పెద్దల ముందు ఉంచే ధైర్యం చేయలేకపోయారు. కులాంతర వివాహానికి కుటుంబ సభ్యులు ఒప్పుకోరనే ఉద్దేశంతోనే ఆత్మహత్యకు పాల్పడి ఉంటారని పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.