టీడీపీ ని టార్గెట్ చేసిన రేవంత్..!

తెలంగాణ కాంగ్రెస్ ఫైర్ బ్రాండ్ రేవంత్ రెడ్డి తొలిసారిగా తెలుగుదేశం పార్టీని టార్గెట్ చేశారు. టీడీపీ ని వీడినప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ పార్టీ పైన, అధినేత చంద్రబాబు పై ప్రత్యంక్షంగా కానీ పరోక్షంగా రేవంత్ రెడ్డి ఏనాడూ విమర్శలు చేసిన దాఖలాలు లేవు. కానీ ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర ఓటమిని చవిచూసిన టీడీపీ పై రేవంత్ తొలిసారిగా విమర్శలు ఎక్కుపెట్టడం పట్ల తెలుగు తమ్ముళ్లు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. సాధారణ నాయకునిగా ఉన్న రేవంత్ రెడ్డి కి రెండుసార్లు అసెంబ్లీ టికెట్ ఇచ్చి ప్రోత్సహించడమే కాకుండా, రాజకీయంగా అన్ని విధాలుగా పెంచి పెద్ద చేసిన టీడీపీ పై విమర్శలు చేయడం ఏమిటని ? మండిపడుతున్నారు.

తెలంగాణ లో కాంగ్రెస్ కు చెందిన 12 మంది ఎమ్మెల్యేలను అధికార టీఆరెస్ తమతో కలుపుకున్న విషయం తెల్సిందే. ఇదే విషయమై మీడియాతో మాట్లాడుతూ రేవంత్ అసలు విషయాన్ని పక్కన పెట్టి కొసరు విషయాన్ని మాట్లాడడం ఇప్పుడు హాట్ టాఫిక్ మారింది. గత శాసనసభ ఎన్నికల్లో వైస్సార్ కాంగ్రెస్ తరుపున గెల్చిన 23 మంది ఎమ్మెల్యేలను, పలువురు ఎంపిలను లాక్కున్న తెలుగుదేశం పార్టీ కి ఇటీవల జరిగిన ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఏ గతి పట్టిందో రానున్న రోజుల్లో టీఆరెస్ కు అదే గతి పడుతుందని రేవంత్ వ్యాఖ్యానించారు. టీఆరెస్ ను రేవంత్ విమర్శించాలని అనుకోవడం సహజమే అయినా పరోక్షంగా టీడీపీ ని టార్గెట్ చేయడం ఏమిటన్న వాదనలు విన్పిస్తున్నాయి.

తనకు రాజకీయంగా ఉన్నత అవకాశాలు కల్పించిన పార్టీ పై రేవంత్ ఈ రకమైన వ్యాఖ్యలు చేయడం వెనుక అసలు మతలబు ఏమిటన్నదానిపై రాజకీయ వర్గాల్లో చర్చ కొనసాగుతోంది. ఆంధ్ర ప్రదేశ్ లో ఇప్పుడప్పుడే టీడీపీ కోలుకునే పరిస్థితి లేదని, ఇక తెలంగాణ లో ఆ పార్టీ పని అయిపోయిందని భావించే రేవంత్ ఈ రకమైన విమర్శలు చేసి ఉంటారన్న వాదనలు విన్పిస్తున్నాయి. తాను భవిష్యత్తు లో రాజకీయంగా మరింత ఎదగాలంటే చంద్రబాబు కు సన్నితుడనే ముద్ర ను చెడిపివేసుకోవడమే బెటరని భావించి రేవంత్ ఈ రకమైన విమర్శలు చేసి ఉంటారని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.