ఒక పార్టీలో గెలిచి ఇంకొక పార్టీలోకి మారడం తప్పే..!

పార్టీ ఫిరాయింపులపై కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. 2004లో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కాంగ్రెస్‌లో చేర్చుకోవడం ముమ్మాటికి తప్పే అని, ఇప్పుడు టీఆర్ఎస్ కూడా అదే తప్పు చేస్తోందని వ్యాఖ్యానించారు. అప్పుడు తాను కూడా పార్టీ మారి తప్పు చేశానని అన్నారు. 2004లో ఆయన టీఆర్ఎస్ ఎమ్మెల్యేగా గెలిచి కాంగ్రెస్‌లోకి వెళ్లిన విషయం తెలిసిందే.

డబ్బులు తీసుకుని పార్టీ మారడం కన్నా రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకోవడం మంచిదన్నారు. మీడియతో ఆయన మాట్లాడుతూ.. ‘ఒక పార్టీలో గెలిచి ఇంకొక పార్టీలోకి మారడం తప్పే. అవి విలువలతో కూడుకున్న రాజకీయాలు కావు. ప్రజలు టీఆర్ఎస్‌కు అధికార హోదా, కాంగ్రెస్‌కు ప్రతిపక్ష హోదా ఇచ్చారు. ఎవరి స్థానంలో వుండి వాళ్లు ప్రజా పాలన చేసుకుంటే మంచిది. 2004లో మేము కాంగ్రెస్‌లోకి డబ్బులకు ఆశపడి పోలేదు. ఇప్పుడున్న పరిస్థితులు అప్పుడు లేవు. ఇప్పుడు ఎవరు పార్టీ ఫిరాయించినా డబ్బుల కోసమే పార్టీ మారారనే అంటారు. డబ్బలకు జగ్గారెడ్డి ఎప్పుడూ అమ్ముడుపోడు. రాజకీయాలు లేకపోయినా పర్వాలేదు గానీ, ఈ పార్టీలు మారే ప్రసక్తే లేదు. బలమైన ప్రతిపక్షం వున్నప్పుడే ప్రభుత్వం చేసే మంచీ చెడులను ఎత్తి చూపే ఆస్కారం వుంటుంది. అది టీఆర్ఎస్ ప్రభుత్వానికే మంచిది’ అని జగ్గారెడ్డి వ్యాఖ్యానించారు.