రవిప్రకాశ్ ముందస్తు బెయిల్ పిటిషన్ తిరస్కరించిన హై కోర్ట్..!

టివి9 మాజీ సీఈవో రవిప్రకాశ్ కు హై కోర్టు షాక్ ఇచ్చింది. విచారణకు హాజరుకాకుండా దాదాపు పది రోజులుగా పోలీసుల నుండి తప్పించుకు తిరుగుతున్న రవిప్రకాశ్ అరెస్టు ముప్పు నుండి తప్పించుకునేందుకు హై కోర్టులో ముందస్తు బెయిల్ పిటీషన్ వేశారు. అయితే ఆ పిటీషన్ ను కోర్టు కొట్టేసింది. అంటే పోలీసు విచారణకు హాజరు కావటం తప్ప రవిప్రకాశ్ కు వేరే దారి లేదని అర్ధమైపోయింది.

టివి 9 సీఈవో గా ఉన్న కాలంలో కంపెనీ సెక్రటరీ సంతకాన్ని పోర్జరీ చేశారని, నిధులను దారి మళ్ళించారనే ఆరోపణలను ఎదుర్కొంటున్న విషయం అందరికీ తెలిసిందే. టివి9 కొత్త యాజమాన్యం రవిప్రకాశ్ పై సైబరాబాద్ పోలీసుకు ఫిర్యాదు చేసింది. దాని ఫలితమే రవిపై పోలీసులు అనేక సెక్షన్ల క్రింద కేసులు పెట్టారు.

విచారణకు హాజరు కావాల్సిందిగా పోలీసులు నోటీసులు ఇచ్చినా లెక్క చేయటం లేదు. ముంబాయ్ లో ఉన్నారని, అమరావతిలో ఉన్నారనే ప్రచారం జరుగుతోంది కానీ రవిప్రకాశ్ మాత్రం పోలీసులకు అందబాటులోకి రావటం లేదు. ఇప్పటికే మూడు నోటీసులు జారీ చేసిన పోలీసులు ఈరోజు అరెస్టు వారెంట్ కూడా జారీ చేస్తారని అనుకుంటున్నారు.

విచారణ నోటీసుల స్ధాయి నుండి అరెస్టు వారెంట్ జారీ దాకా వ్యవహారం వచ్చిందంటే ఎంతలా మురిగిపోతోందో అర్ధమైపోతోంది. నిజానికి పోర్జరీ, నిధుల దారి మళ్ళింపు కేసులంటే అరెస్టు చేసేంత పెద్దవేమీ కావు. పోలీసుల విచారణకు హాజరైన సమయంలో అరెస్టు చేయకుండా ముందస్తు బెయిల్ తీసుకునే అవకాశం ఉంది. అయితే రవిప్రకాశ్ ఆ దిశగా ఆలోచించకుండా ప్రిస్టేజికి పోయినట్లు కనబడతోంది. అందుకే పోలీసులు కూడా రవిప్రకాశ్ ను అరెస్టు చేస్తారనే ప్రచారం పెరిగిపోతోంది. అందరికీ ఇంతకాలం బుద్ధులు చెప్పిన రవిప్రకాశే చివరకు కుడితిలో పడినట్లైంది.