ఢిల్లిలో భారీ విధ్వంసాలకు కుట్ర చేస్తున్న ఉగ్రవాదులుని అరెస్ట్ చేసిన ఎన్‌ఐఏ

భాగ్యనగరంలో మరోసారి ఉగ్ర వాద మూలాలు బయటపడ్డా యి. దేశ రాజధాని ఢిల్లి సహా పలుచోట్ల విధ్వంసానికి ఐసిస్‌కు చెందిన ఉగ్రవాదులు కుట్రపన్నా రన్న కేసుకు సంబంధించి తాజా సమాచారం మేరకు శనివారం నగర శివారు మైలార్‌దేవ్‌పల్లి పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని శాస్త్రిపురంతో సహా మూడు చోట్ల జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఎ) తనిఖీలు నిర్వహించింది. కింగ్స్‌ కాలనీలో నివాసం ఉంటూ ఐసిస్‌ సానుభూతిపరుడు కర్నాటకకు చెందిన తాహా మసూద్‌ అనే యువకుడిని అరెస్టు చేసిన ఎన్‌ఐఏ అధికారులు అతడి నుంచి కొన్ని సాంకేతిక పరికరాలు, 13 మొబైల్‌ ఫోన్లు, 11 సిమ్‌ కార్డులు, ఒక ఐపాడ్‌, రెండు ల్యాప్‌టాప్‌లు, 1 హార్డ్‌ డిస్క్‌, 6 పెన్‌డ్రైవ్‌లు, 6 ఎస్డీ కార్డులు, 3 వాకీటాకీ సెట్లు, మరికొన్ని డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు. అరెస్టు చేసిన తాహాను మాదాపూర్‌లోని ఎన్‌ఐఏ కార్యాలయానికి తరలించారు.

ఈ తనిఖీల్లో మరో నలుగురిని కూడా అదుపులోకి తీసుకున్న ఎన్‌ఐఏ వారిని విచారిస్తోంది. ఎనిమిది నెలల క్రితం హైదరాబాద్‌లో అబ్దుల్‌ బాసిత్‌, అబ్దుల్‌ ఖాదిర్‌తో సహా పలువురిని ఎన్‌ఐఏ అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. కాగా ఢిల్లి జైలులో ఉన్న బాసిత్‌, ఖాదిర్‌ ఇచ్చిన సమాచారంతో ఇప్పుడు ఎన్‌ఐఏ అకస్మాత్తుగా తనిఖీలు చేపట్టింది. హైదరాబాద్‌లో తనిఖీలు జరిపిన సమయంలోనే అటు వార్ధాలోనూ ఎన్‌ఐఏ సోదాలు నిర్వహించింది. ఈ కేసులో సూత్రధారి బాసిత్‌తో తాజాగా అరెస్టయిన తాహాకు సంబంధాలున్నాయని, వారి మధ్య సంప్రదింపులు జరిగాయని ఎన్‌ఐఏ గుర్తించింది.

ఢిల్లి పేలుళ్లకు కుట్రపన్నిన కేసులో ప్రధాన నిందితుడిగా భావిస్తున్న అబ్దుల్‌ బాసిత్‌ 2014లో సిరియాకు, 2016లో ఆఫ్ఘనిస్తాన్‌ వెళ్లేందుకు విఫలయత్నం చేసినట్లు ఎన్‌ఐఏ దర్యాప్తులో తేలింది. ఐసిస్‌ ఉగ్రవాది అద్నాన్‌తో నిత్యం సంప్రదింపులు నిర్వహించిన బాసిత్‌, భారత్‌లో ఉగ్రవాదం వ్యాప్తికి ప్రయత్నించినట్లు ఎన్‌ఐఏ అధికారులు గుర్తించారు. 8 నెలల క్రితం హైదరాబాద్‌లో అబ్దుల్‌ బాసిత్‌తో పాటు అబ్దుల్‌ ఖాదిర్‌ను అరెస్టు చేసిన అధికారులు వారి నుంచి కొన్ని పేలుడు పదార్థాలు, ఎలక్ట్రానిక్‌ పరికరాలను స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం అబ్దుల్‌ బాసిత్‌, అబ్దుల్‌ ఖాదిర్‌ ఆ కేసులో ఢిల్లిలో జైలు ఖైదీలుగా ఉన్నారు. అబుదాబిలో ఐఎస్‌ఐఎస్‌ మాడ్యూల్‌ కేసులో బాసిత్‌పై ఛార్జిషీటు నమోదైంది. మరికొందరికి ఐఎస్‌ఐఎస్‌తో సంబంధం ఉన్నట్లు విచారణలో వెల్లడైంది. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్‌లో ఎన్‌ఐఏ అధికారులు సోదాలు నిర్వహించారు. పోలీసుల సహకారంతో ఏడెనిమిది ఇళ్లల్లో ఈ తనిఖీలు చేపట్టారు.
రెండేళ్లక్రితం ఏం జరిగిందంటే.
ఢిల్లిలో భారీ విధ్వంసాలకు పాల్పడాలన్న ఐసిస్‌ సూచన మేరకు హైదరాబాద్‌కు చెందిన కొందరు యువకులు కుట్ర పన్నారు. అయితే ఈ కుట్రను రెండేళ్లక్రితం భగ్నం చేసిన ఎన్‌ఐఏ ముగ్గురిని ఐసిస్‌ ఉగ్రవాదులను అరెస్టు చేసింది. ఉగ్రదాడికి సంబంధించి హైదారాబాద్‌ కేంద్రంగా ఏర్పాట్లు చేసుకున్న నిందితులు రసాయన పదార్థాలు, నగదు, ఇతర సామాగ్రి సిద్ధం చేసుకున్నారు. అయితే సకాలంలో అందిన సమాచారంతో ఎన్‌ఐఏ అప్రమత్తమవడంతో ముప్పు తప్పింది. ఢిల్లికి చెందిన ఆర్‌ఎస్‌ఎస్‌ నాయకుడి హత్య కోసం కూడా వీరు కుట్రపన్నగా. అది అమలు చేసేందుకు హైదారాబాద్‌కు చెందిన అబ్దుల్‌ బాసిత్‌ ఢిల్లికి వెళ్లాడు. అక్కడ నలుగురు సహచరులకు ఏకే 47 తుపాకులు సమకూర్చాడు. ఈ లోగా ఎన్‌ఐఏకు ఉప్పందడంతో దాడులు చేసి ఆ నలుగురినీ అరెస్టు చేశారు. అక్కడి నుంచి జారుకున్న బాసిత్‌ హైదరాబాద్‌కు చేరుకోవడం, ఆ తరువాత అతడితోపాటు మరో ఇద్దరిని ఎనిమిది నెలల క్రితం పోలీసులు అరెస్ట్‌ చేశారు.


అప్పుడు పాతబస్తీలో తనిఖీలు
గతంలో ఢిల్లి ఎయిర్‌పోర్టులో రహమాన్‌ అనే తీవ్రవాది ఇచ్చిన సమాచారంతో హైదరాబాద్‌ పాతబస్తీలోని షాహిన్‌నగర్‌, పహాడీ షరీఫ్‌లో ఎన్‌ఐఏ తనిఖీలు జరిపిన విషయం విదితమే. ఐసిస్‌తో సంబంధాలున్న కొందరు వ్యక్తులు ఇక్కడ తలదాచుకున్నారన్న సమాచారంతో గాలింపు చేపట్టారు. ఈ సోదాల్లో ఇద్దరు అనుమానితుల్ని అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. అలాగే ఓ ఇంట్లో కీలకమైన ల్యాప్‌టాప్‌తో పాటూ మొబైల్స్‌ను స్వాధీనం చేసుకున్నారు.