ఇంటర్ పరీక్షల్లో నిన్న సున్నా… నేడు రీవాల్యుయేషన్ లో 99 మార్కులు!

తెలంగాణలో ఎన్నడూలేని విధంగా ఇంటర్ మార్కుల వ్యవహారం ఓ ప్రహసనంలా మారింది. ఈ నెల 18న ఇంటర్మీడియట్ ఫలితాలు వెల్లడి కాగా, కొందరికి దిగ్భ్రాంతి కలిగించేలా మార్కులు వచ్చాయి. ఇంటర్ ఫస్టియర్ తెలుగు సబ్జక్టులో 98 మార్కులు తెచ్చుకున్న ఓ విద్యార్థినికి సెకండియర్ లో షాకిచ్చారు. ఆమెకు సున్నా మార్కులు వచ్చినట్టు మెమోలో చూపారు. దాంతో ఆ విద్యార్థిని లబోదిబోమంది. 

ఈ అమ్మాయే కాదు, పెద్ద సంఖ్యలో ఇలాంటి అవకతవకలు జరిగినట్టు తెలియడంతో నాంపల్లిలో ఉన్న ఇంటర్ బోర్డు కార్యాలయం ఎదుట తల్లిదండ్రులు ఆందోళన చేశారు. ఈ నేపథ్యంలో, సున్నా మార్కులు తెచ్చుకున్న విద్యార్థిని తెలుగు పేపర్ ను రీవాల్యుయేషన్ చేయించగా, దిమ్మదిరిగే రీతిలో 99 మార్కులు వచ్చినట్టు తేలింది. 

దీంతో, ఇంటర్ పేపర్ల మూల్యాంకనం ఎలాంటి పరిస్థితుల్లో నిర్వహించారోనంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అనుభవంలేని వ్యక్తులతో వాల్యుయేషన్ చేయించిన కారణంగానే మార్కులు అస్తవ్యస్తంగా వేశారంటూ తల్లిదండ్రులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.