నో సౌండ్, నో పొల్యూషన్….

హైదరాబాద్ : తెలంగాణ ఆర్టీసీ ప్రస్థానంలో మరో మైలురాయి. సౌండ్, ఎయిర్ పొల్యూషన్ లేని ఎలక్ట్రిక్ బస్సులు.. ఇప్పటికే హైదరాబాద్ రోడ్లపై పరుగులు పెడుతున్నాయి. శంషాబాద్ ఎయిర్ పోర్టు వరకు నడిచే 40 బస్సులు ఇదివరకే ప్రయాణీకులకు సేవలు అందిస్తున్నాయి. మియాపూర్, కంటోన్మెంట్ డిపోల నుంచి రన్ అవుతున్నాయి. మరో 60 బస్సులు నడిపేందుకు ప్లాన్ చేస్తున్నారు అధికారులు

పెరుగుతున్న జనాభా, దానికనుగుణంగా రెట్టింపవతున్న కాలుష్యం దృష్టిలో పెట్టుకుని నివారణ చర్యలకు శ్రీకారం చుట్టారు ఆర్టీసీ అధికారులు. అందులోభాగంగా ఎలక్ట్రిక్ బస్సులను అందుబాటులోకి తెచ్చారు. వీటిలో ఏసీ సౌకర్యం ఉంటుంది. అయితే ప్రయాణీకులను ఆకర్షించేందుకు.. వైపై, రేడియో సిస్టం లాంటి తదితర సదుపాయాలు ఉండటం విశేషం. ఇవి ప్రయాణీకులకు కొత్త అనుభూతిని మిగల్చనున్నాయి.

100 ఎలక్ట్రిక్ బస్సులు హైదరాబాద్ లో తిప్పాలనేది ఆర్టీసీ అధికారుల ప్రణాళిక. అందులో ఇప్పటికే 40 బస్సులను మార్చి 5వ తేదీ నుంచి అందుబాటులోకి తెచ్చారు. మొదటిదశలో భాగంగా ప్రవేశపెట్టిన 40 బస్సులు జేబీఎస్, మియాపూర్, కూకట్‌పల్లి ప్రాంతాల నుంచి సేవలు అందిస్తున్నాయి. ఈ 3 ప్రాంతాల నుంచి శంషాబాద్ ఏయిర్‌పోర్టుకు ప్రయాణీకులను చేరవేస్తున్నాయి. 100 బస్సుల ప్రణాళికలో భాగంగా ఇప్పటికే 40 బస్సులు హైదరాబాద్ రోడ్లెక్కడంతో.. మరో 60 బస్సులను మే మొదటి వారంలో తెరపైకి తేనున్నారు. అయితే ఎలక్ట్రిక్ బస్సులను ప్రతిష్టాత్మకంగా నడుపుతున్నప్పటికీ ఆదాయం విషయంలో ఆర్టీసీకి సంతృప్తి లేదు. ఈ బస్సుల్లో ప్రయాణించే వారి సంఖ్య తక్కువగా ఉంటోంది. ఓఆర్ రేషియో చూసినట్లయితే కేవలం 20 – 25 శాతం మాత్రమే నమోదవుతోందట. అదలావుంటే రానురాను ఈ బస్సులు ప్రయాణీకులను ఆకట్టుకుంటాయని.. మంచి ఫలితాలు వస్తాయని ఆర్టీసీ అధికారుల ధీమాగా కనిపిస్తోంది.

హైదరాబాద్ రోడ్లపై పరుగులు పెడుతున్న ఎలక్ట్రిక్ బస్సులతో సౌండ్ లేదు పొల్యూషన్ లేదు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా కేంద్ర ప్రభుత్వం ఒక్కో బస్సుకు కోటి రూపాయల సబ్సిడీ ఇస్తోంది. వీటిని ఒలెక్ట్రా బిడ్ అనే సంస్థ భారత్ లోనే తయారుచేస్తుండటం విశేషం. లిథియం ఇయాన్ బ్యాటరీతో నడిచే ఈ బస్సులు ప్రయాణీకులకు కొత్త అనుభూతిని మిగల్చనున్నాయి. ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే దాదాపు 250 కిలోమీటర్ల మేర ప్రయాణిస్తాయి.

Read more at: https://telugu.oneindia.com/news/hyderabad/no-sound-no-pollution-more-60-electric-buses-on-to-hyderabad-roads/articlecontent-pf215493-242848.html