తెలంగాణ ద్రోహితో పొత్తా … ఛీ.. మీ బతుకులు.. కేసీఆర్‌ ఫైర్..!

ఒక పక్క మోడీ ని బూచిగా చూపిస్తూ ఆంధ్రాలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఎన్నికల పోరాటానికి సిద్ధమవుతుంటే.. తెలంగాణ సీఎం కెసిఆర్ కూడా తన పాత బాస్ ఎన్నికల వ్యూహాన్నే నమ్ముకున్నారు. చంద్రబాబునే బూచిగా చూపిస్తూ తెలంగాణలో ఎన్నికల ప్రచారానికి తెర తీశారు. చంద్రబాబే టార్గెట్ గా మహాకూటమిపై నిజామాబాద్‌ సభలో కేసీఆర్‌ నిప్పులు చెరిగారు. ‘అడుక్కుంటే మేమే నాలుగు సీట్లిచ్చేవాళ్లం కదా? సిగ్గులేకుండా చంద్రబాబుతో పొత్తా? రాష్ట్రాన్ని అమరావతికి తాకట్టు పెడతారా?’ అంటూ కాంగ్రెస్‌ నాయకులనుద్దేశించి ప్రశ్నలు సంధించారు.

‘చంద్రబాబు నాయుడు ఓ దుర్మార్గుడు. తెలంగాణను అస్థిరపరిచేందుకు దొంగలా వ్యవహరిస్తున్నాడు’ అంటూ ఘాటుగా విమర్శించారు. నిజామాబాద్‌ గిరిరాజ్‌ కళాశాల మైదానంలో టీఆర్‌ఎస్‌ ‘ప్రజా ఆశీర్వాద సభ’ ను బుధవారం నిర్వహించారు. ఈ సభలో కెసిఆర్ మాట్లాడుతూ ‘రాష్ట్రాన్ని అస్థిరపరచాలని చంద్రబాబు నాయుడు ఓటుకు నోటు కేసులో దొరికిన అడ్డమైన దొంగ కాదా?’ అని ప్రశ్నించారు. ‘కాంగ్రెస్‌ ప్రచారానికి చంద్రబాబు రూ.500 కోట్లు ఇస్తారట. చంద్రబాబు అడుగులకు మడుగులు వొత్తుతున్నారు.

ఇదా తెలంగాణకు కావాల్సింది? ఇందుకేనా పోరాటం చేసి రాష్ట్రాన్ని తెచ్చుకున్నది?’ అంటూ ప్రశ్నించారు. తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రంలోని ఏడు మండలాలను గుంజుకున్న దుర్మార్గుడు చంద్రబాబు అని ఆరోపించారు. సీలేరు విద్యుత్తు ప్రాజెక్టును లాక్కున్నా డని, ఒప్పందానికి వ్యతిరేకంగా కరెంటు సరఫరా నిలిపేశాడని, కృష్ణా, గోదావరి ప్రాజెక్టులనూ అడ్డుకుంటున్నాడని కేసీఆర్‌ విమర్శించారు. అటువంటి దుర్మార్గుడితో పొత్తుపై కాంగ్రెస్‌ పునరాలోచించాలని హితవు పలికారు. తెలుగుదేశంతో పొత్తు తెలంగాణ ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టడమేనంటూ నిరసించారు. ఇది ఆంధ్రోళ్లకు తిరిగి అధికారాన్ని అప్పగించే కార్యక్రమమేనని దుయ్యబట్టారు. మరోవైపు 2014 ఎన్నికల్లో మోడీ.. ప్రతి వ్యక్తి ఖాతాలో వేస్తానన్న రూ.15 లక్షలు ఏవంటూ ప్రశ్నించారు.

మిషన్‌భగీరథ, మిషన్‌ కాకతీయ, 24గంటల కరెంటు, పింఛన్లు వంటి 452 సంక్షేమ కార్యక్రమాలు చేపట్టామని కెసిఆర్ వివరించారు. మరోవైపు అభివృద్ధికి నిరంతరం విఘా తం కలిగిస్తోందని కాంగ్రెస్‌పై విరుచుకుపడ్డారు. ఒక్క కాళేశ్వరం ప్రాజెక్టుపైనే 196 కేసులు వేశారని ఆరోపించారు. నిజామాబాద్‌ జిల్లాలో బాన్స్‌వాడ, బోధన్‌, డిచ్‌పల్లిల్లో 70, 80, 90 ఏళ్ల కిందట వచ్చినవారిని ఆంధ్రావారిగా చూడడం లేదు. వారూ తెలంగాణ బిడ్డలే. ఇక్కడున్న వారు తాము ఆంధ్రా అనే భావం వదిలిపెట్టాలి’ అని కేసీఆర్‌ అన్నారు.

Post expires at 2:53pm on Thursday October 4th, 2018