బతుకమ్మ చీరలకు బ్రేక్ చెప్పిన ఎన్నికల సంఘం..!

తెలంగాణలో బతుకమ్మ చీరల పంపిణీకి కేంద్ర ఎన్నికల సంఘం బ్రేక్ వేసింది. ఈ నెల 9వ తేదీ నుంచి బతుకమ్మ పండుగ ప్రారంభం కానుండగా..12 నుంచి బతుకమ్మ చీరల పంపిణీకి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. కానీ ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున బతుకమ్మ పండుగ సందర్భంగా చీరలు పంపిణీ చేయొద్దని కేంద్ర ఎన్నికల కమిషన్ ఆదేశించింది. రాష్ట్రంలో ఆపద్ధర్మ ప్రభుత్వం కొనసాగుతున్న నేపథ్యంలో ప్రజలకు చీరల పంపిణీ కార్యక్రమం చేపట్టడం సరి కాదని, అంతేకాకుండా ఎన్నికల కోడ్‌ ఉల్లంఘించినట్టు అవుతుందని పేర్కొంది.

బతుకమ్మ పండుగ సందర్భంగా రాష్ట్రంలోని పేద మహిళలకు చీరల పంపిణీ కార్యక్రమ గతేడాది నుంచీ తెరాస ప్రభుత్వం ప్రారంభించింది. ఈ ఏడాది కూడా 95 లక్షల మందికి చీరల పంపిణీ చేసేందుకు రూ.280 కోట్లతో నాణ్యత గల చీరలను రాష్ట్రంతో పాటు సూరత్‌, ముంబయిల నుంచి కొనుగోలు చేసింది. ఈనెల 12 నుంచి చీరల పంపిణీ చేపట్టడానికి ఆపద్ధర్మ ప్రభుత్వం సన్నాహాలు చేయగా దీనిపై అన్ని రాజకీయ పార్టీలు రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. దీన్ని పరిశీలించిన కేంద్ర ఎన్ని కల కమిషన్‌ చీరల పంపిణీ ప్రక్రియను నిలిపివేయాలని ఆదేశించింది.

గత ఏడాది దసరా పండుగ సందర్భంగా పంపిణీ చేసిన చీరలు నాణ్యత లేకపోవడంతో ప్రభుత్వంపై విమర్శలు చెలరేగాయి. దానితో ఈసారి ముందస్తు ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని పేద మహిళలకు నాణ్యమైన చీరలు పంపిణీకి ఒక ప్రత్యేక అధికార బృందాన్ని కూడా నియమించింది. అయితే ఈసీ నిర్ణయంతో టీఆరెఎస్ పార్టీ ఖంగుతినగా.. విపక్షాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.

Post expires at 2:43pm on Thursday October 4th, 2018