తెరాస నేత బాబు మోహన్ బీజేపీ లో చేరిక..!

తెరాస తాజా మాజీ ఎమ్మెల్యే బాబూమోహన్‌ తన కుమారుడు ఉదయ్ తో కలిసి శనివారం పార్టీ జాతీయాధ్యక్షుడు అమిత్‌ షా సమక్షంలో బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ ప్రధాని మోడీ, అమిత్ షా నేతృత్వంలో పనిచేసేందుకు ఆసక్తితో ఉన్నానని, బీజేపీ ఇచ్చినఅవకాశాన్ని సద్వినియోగం చేసుకుని పార్టీ కోసం పని చేస్తా’ అని బాబూమోహన్‌ అన్నారు. అధిష్టానం ఆదేశిస్తే రాష్ట్రంలో ఎక్కడి నుంచైనా పోటీ చేస్తానని పేర్కొన్నారు.

గత ఎన్నికల సమయంలో హరీశ్‌రావు ఫోన్‌ చేసి తనను టీఆర్‌ఎస్‌లోకి ఆహ్వానించారని, ఆందోల్‌ నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుపొందానన్నారు. కానీ ఈసారి ముందస్తు ఎన్నికల నేపథ్యంలో ప్రకటించిన టీఆర్‌ఎస్‌ అభ్యర్థుల జాబితాలో తన పేరు లేకపోవడం ఆశ్చర్యానికి గురిచేసిందని, 105 మందిలో నేను ఒక్కడినే పనికి రానివాడినా అని ఆవేదనగా ప్రశ్నించారు. తనకు టికెట్‌ ఎందుకు కేటాయించలేదని కేటీఆర్‌ను అడిగితె కేసీఆర్ ఫోన్ చేస్తారని చెప్పారు. 20 రోజులు ఎదురుచూసినా నిరాశే మిగిలిందని బాబూమోహన్‌ చెప్పారు. టీఆర్‌ఎస్‌కు తాను ఎందుకు పనికిరాలేదో, టికెట్‌ ఎందుకు ఇవ్వలేదోనన్న విషయాలన్నీ సమయం వచ్చినపుడు బయటపెడతానని బాబు మోహన్ వ్యాఖ్యానించారు.