కాంగ్రెస్ గూటికి కొండా దంపతులు..!

తెరాసలో టికెట్ ఇవ్వనందున ఆ పార్టీ నేతలపై నిరసన గళం విప్పిన మాజీ మంత్రి, మాజీ ఎమ్మెల్యే కొండా సురేఖ, ఎమ్మెల్సీ కొండా మురళీ కాంగ్రెస్‌లో చేరారు. పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కాంగ్రెస్‌ నేతలు షబ్బీర్‌ అలీ, పొన్నాల లక్ష్మయ్యల సమక్షంలో కొండా దంపతులు ఏఐసీసీ కార్యాలయంలో పార్టీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీని కలిసి కాంగ్రెస్‌ తీర్థం పుచ్చుకున్నారు. రాహుల్‌తో కాంగ్రెస్‌ రాష్ట్ర నాయకులు, కొండా దంపతులు, ఇటీవలే కాంగ్రెస్‌లో చేరిన మాజీ ఎంపీ రమేశ్‌ రాథోడ్‌ దంపతులు సమావేశమయ్యారు. కొండా దంపతుల చేరికతో ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో కాంగ్రెస్‌ బలోపేతమవుతుందని రాహుల్‌ ఆశాభావం వ్యక్తం చేశారు.

“మేం పార్టీ నుంచి బయటకు వెళితే ఎలా ఉంటుందో, మా సత్తా ఏమిటో తెరాసకు చూపిస్తాం.. వాళ్ల తప్పులు కప్పిపుచ్చుకునేందుకు రెండు, మూడు టికెట్లు అడిగామని మాపై తప్పుడు ప్రచారం చేశారు. మేం కాంగ్రెస్‌లోనే పుట్టి పెరిగాం. బడుగు, బలహీనవర్గాలకు న్యాయం జరుగుతుందనే కాంగ్రెస్‌లో చేరాం” అని ఈ సందర్భంగావిలేకర్ల సమావేశంలో కొండా దంపతులు వ్యాఖ్యానించారు.

బీసీ నాయకుల్లో బలమైన కుటుంబంగా కొండా దంపతులపై రాహుల్‌కు విశ్వాసం ఉంది. రానున్న ఎన్నికల్లో రాష్ట్రవ్యాప్తంగా కొండా సురేఖతో ప్రచారం చేయిస్తాం.. అని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. రమేశ్‌ రాథోడ్‌ దంపతుల చేరికతో ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలోని పది నియోజకవర్గాలపై ప్రభావం ఉంటుందని, కాంగ్రెస్‌విజయం ఫై ధీమా వ్యక్తం చేసారు.