ఇకపై రాత్రిపూటే నీటి లిఫ్టింగ్..!

46

కాళేశ్వరం, దేవాదుల, కల్వకుర్తి వంటి భారీ ప్రాజెక్టులకు సంబంధించిన పంపు మోటార్లను వీలైనంత వరకు రాత్రి పూటనే నడిపించాలని ప్రభుత్వం అధికారులను ఆదేశించింది. రాష్ట్రంలో ప్రస్తుతం రబీ సీజన్‌ ప్రారంభమైన విషయం తెలిసిందే. ఈ ఏడాది గోదావరితో పాటు, కృష్ణా బేసిన్‌లోనూ నీటి లభ్యత బాగుంది.దాంతో ఆయా ప్రాజెక్టుల పరిధిలో పంటల సాగు కోసం రెండు, మూడు మాసాల పాటు నీటిని పంపింగ్‌ చేయాల్సి ఉంటుంది. ముఖ్యంగా కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి వీలైనంత ఎక్కువ రోజుల పాటు నీటిని లిఫ్ట్‌ చేసి, ఆయా ప్రాంతాల్లోని రిజర్వాయర్లు, చెరువులను నింపాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాబోయే రోజుల్లో ఎండల తీవ్రత పెరగనున్న నేపథ్యంలో ఇతర రంగాల్లోనూ విద్యుత్తు డిమాండ్‌ భారీగా పెరగనుంది. ముఖ్యంగా పగటి పూట విద్యుత్తు వాడకం ఎక్కువగా ఉంటుంది. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని ఇరిగేషన్‌ ప్రాజెక్టుల పంపులను వీలైనంత వరకు రాత్రి పూటనే నడిపించాలన్న నిర్ణయానికి వచ్చిన అధికారులు.. ఈ మేరకు షెడ్యూల్‌ను రూపొందిస్తున్నారు.