తెలంగాణకు లక్షన్నర కోట్లు

8

తెలంగాణ ఏర్పడ్డాక గత ఆరేళ్లలో కేంద్రం నుంచి రాష్ట్రానికి వివిధ పద్దుల కింద రూ. 1,58,735 కోట్ల నిధులు విడుదలయ్యాయని కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలాసీతారామన్‌ వెల్లడించారు. పద్నాలుగో ఆర్థికసంఘం సిఫార్సులు అమల్లోకి వచ్చాక గత అయిదేళ్లలో రూ. 1,41,735 కోట్లు వెళ్లాయని చెప్పారు. కాంగ్రెస్‌ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి సోమవారం లోక్‌సభలో అడిగిన ప్రశ్నకు ఆమె సమాధానమిచ్చారు. ‘తెలంగాణ ఆర్థిక పరిస్థితి ఆందోళనకర స్థితిలో ఉందా? ఉంటే ఆ వివరాలేంటి? దానిపై కేంద్రం ఎలా స్పందిస్తోంది? గత ఆరేళ్లలో రాష్ట్రానికి ఏ పద్దు కింద ఎంత నిధులు విడుదల చేశారు? రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం ఎలాంటి అదనపు నిధులూ విడుదల చేయలేదన్నది నిజమా?’ అన్న ప్రశ్నలకు ఆమె వివరంగా స్పందించారు. తెలంగాణ ఆర్థిక పరిస్థితి ఆందోళనకరంగా ఏమీ లేదని స్పష్టంచేశారు. ‘రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్‌ ప్రతుల ప్రకారం 2014-15 నుంచీ రాష్ట్రం రెవెన్యూ మిగులులోనే ఉంది. రుణ-జీఎస్‌డీపీ నిష్పత్తి (2014-15 నుంచి 2019-20 వరకు బడ్జెట్‌ అంచనాల ప్రకారం) పెరుగుతున్నప్పటికీ అది 14వ ఆర్థికసంఘం నిర్దేశించిన పరిమితులు, రాష్ట్ర ప్రభుత్వ మధ్యంతర ఆర్థిక విధాన ప్రకటన ప్రకారమే ఉంది’ అని పేర్కొన్నారు.