ఓపెనర్ల పరీక్షలో ముగ్గురూ విఫలం..!

16

న్యూజిలాండ్‌తో జరగనున్న తొలి టెస్టులో ఓపెనర్లుగా ఎవరిని బరిలోకి దించాలన్న ప్రశ్నకు ‘న్యూజిలాండ్‌ ఎలెవన్‌ ప్రాక్టీస్‌ మ్యాచ్‌’ సమాధానం ఇస్తుందని టీమ్‌ఇండియా భావించింది. అయితే ప్రస్తుతం హామిల్టన్‌ వేదికగా జరుగుతున్న ఈ సన్నాహక మ్యాచ్‌లో ఓపెనర్ల రేసులో ఉన్న మయాంక్‌ అగర్వాల్‌, పృథ్వీ షా, శుభ్‌మన్‌ గిల్‌.. ముగ్గురూ విఫలమయ్యారు. ఓపెనర్లుగా బరిలోకి దిగిన పృథ్వీ డకౌటవ్వగా, మయాంక్‌ ఒక్క పరుగుకే పరిమితమయ్యాడు. అనంతరం వన్‌డౌన్‌లో వచ్చిన గిల్ కూడా నిరాశపరిచాడు. ఖాతా తెరవకముందే పెవిలియన్‌కు చేరాడు. అయిదో స్థానంలో వచ్చిన రహానె (18) కూడా తక్కువ స్కోరుకే వెనుదిరిగాడు. దీంతో ఫిబ్రవరి 21 నుంచి కివీస్‌తో జరగనున్న తొలి టెస్టులో ముగ్గురిలో ఎవరికి ఓపెనర్లుగా అవకాశం దక్కుతుందా అని ఆసక్తి నెలకొంది.