క్రికెట్ బుకీ అరెస్ట్..!

14

2000 సంవత్సరం మ్యాచ్‌ ఫిక్సింగ్‌ ఉదంతంలో కీలక నిందితుడు, ప్రధాన బుకీ సంజీవ్‌చావ్లాను దిల్లీ పోలీసులు గురువారం ఉదయం భారత్‌కు తీసుకొచ్చారు. ఇంగ్లాండ్‌ నుంచి దిల్లీకి తీసుకొచ్చిన పోలీసులు అతడిని తీహార్‌ జైలుకు తరలించే అవకాశం ఉంది. అంతకుముందే అతడికి వైద్య పరీక్షలు జరుపనున్నారు. నాటి దక్షిణాఫ్రికా కెప్టెన్‌ హన్సీ క్రోనేను ఫిక్సింగ్‌కు పాల్పడేలా సంజీవ్‌ చావ్లా ప్రోత్సహించాడని అభియోగాలున్నాయి. ఆ ఏడాది ఫిబ్రవరిలో దక్షిణాఫ్రికా భారత పర్యటనకు వచ్చిన సందర్భంగా హన్సీను ప్రభావితం చేశాడు. ఈ నేపథ్యంలో ఇంగ్లాండ్‌లో ఉంటున్న సంజీవ్‌ను దిల్లీ పోలీసులు విచారణ నిమిత్తం భారత్‌కు తీసుకొచ్చారు. అంతకుముందు స్థానిక అధికారుల వద్ద సంజీవ్‌ను అప్పగించేందుకు అనుమతి తీసుకున్నారు. దీంతో 1992 భారత్‌-ఇంగ్లాండ్‌ నేరగాళ్ల అప్పగింత ఒప్పందం తర్వాత ఆ పెద్ద స్థాయి కేసు ఇదే కావడం గమనార్హం.