46 పరుగుల తేడాతో కోహ్లీసేన విజయం..!

 బంగ్లాదేశ్‌తో జరిగిన చారిత్రక డేనైట్‌ టెస్టులో టీమిండియా ఇన్నింగ్స్‌ 46 పరుగులతో ఘన విజయం సాధించింది. ఈడెన్‌ గార్డెన్స్‌ వేదికగా శుక్రవారం ప్రారంభమైన పింక్‌ టెస్టులో టాస్‌ గెలిచిన బంగ్లా బ్యాటింగ్‌ ఎంచుకుంది. భారత పేసర్లు ఇషాంత్‌ శర్మ(5), ఉమేశ్‌ యాదవ్‌(3), మహ్మద్‌ షమి(2) ధాటికి పర్యాటక జట్టు 106 పరుగులకే కుప్పకూలింది. అనంతరం విరాట్‌ కోహ్లీ(136), పుజారా(55), అజింక్య రహానె(51) రాణించడంతో టీమిండియా రెండో రోజు 347/9 వద్ద తొలి ఇన్నింగ్స్‌ డిక్లేర్డ్‌ చేసింది. రెండో ఇన్నింగ్స్‌ ఆరంభించిన బంగ్లాదేశ్‌కు ఇషాంత్‌(4), ఉమేశ్‌(2) చుక్కలు చూపించారు. దీంతో ఆట నిలిపివేసే సమయానికి ఆ జట్టు 152/6తో నిలిచింది. ఆదివారం ఆట ప్రారంభమైన కొద్దిసేపటికే ఉమేశ్‌ మరోసారి విజృంభించి చివరి మూడు వికెట్లు తీశాడు. ఈ నేపథ్యంలో టీమిండియా 2-0తో టెస్టు సిరీస్‌ను సొంతం చేసుకుంది. అలాగే ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో భారత్‌ 360 పాయింట్లకు చేరింది.