విరాట్ కోహ్లీపై జాన్ సీన పోస్ట్..!

122

ఎంతో మంది రెజ్లింగ్ ప్రియులకు జాన్ సీన ఆరాధ్య దైవం. అమెరికాకు చెందిన ఈ ప్రొఫెషనల్.. రింగులోకి దిగాడంటే ప్రత్యర్థికి దడ దడే. తనదైన శైలిలో పిడిగుద్దులు కురిపిస్తూ ప్రత్యర్థిని మట్టికరిపించే జాన్ సీన.. సోషల్ మీడియాలో కూడా చురుగ్గా ఉంటాడు. విలక్షణరీతిలో వెరైటీ మెమెలతో ట్వీట్లు, పోస్టులు పెడుతూ తన ప్రత్యేకత చూపుతాడు. తాజాగా, టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీపై మెమె పెట్టి వార్తల్లో నిలిచాడు. గతంలో వరల్డ్ కప్ సందర్భంగా కోహ్లీ షేక్ హ్యాండ్ ఇస్తున్న ఫోటో పెట్టి భారత అభిమానులకు దగ్గరైన జాన్ సీన.. ఇప్పుడు మరో ఫోటో పెట్టి మరోసారి అభిమానులను మురిపించాడు. కోహ్లీ 2016 జూలైలో వెయిట్ లిఫ్టింగ్ చేస్తున్న ఫోటో, 2019 జూలైలో వెయిట్ లిఫ్టింగ్ చేస్తున్న ఫోటో పెట్టి.. ఆసక్తికర కామెంట్ చేశాడు.

ఒక ఫోటోలో ఎడమ వైపు తిరిగి ఉన్నట్లు, మరో ఫోటోలో కుడి వైపు తిరిగి ఉన్నట్లు ఉన్న ఫోటోను జత చేసి.. ఒక దిశ నుంచి మరో దిశకు తిరగడానికి కోహ్లీకి మూడేళ్లు పట్టిందంటూ కామెంట్ పెట్టాడు. అంతే.. ఆ ఇన్‌స్టాగ్రామ్ పోస్టుకు క్షణాల్లో బోలెడన్ని లైకులు, కామెంట్లు వచ్చాయి. విరాట్ కోహ్లీ ఎలా తెలుసు? భారత్‌తో మీకు ఏదైనా సంబంధం ఉందా? భారతీయ ఫాలోయర్లను సంపాదించుకోవడానికి ఇలా చేస్తున్నావా? అంటూ ప్రశ్నలతో హోరెత్తిస్తున్నారు.