కివీస్‌పై ఇంగ్లండ్ గెలుపు

పాకిస్తాన్ ఆశల మీద నీళ్లు జల్లుతూ ఐసీసీ వరల్డ్ కప్‌లో సెమీస్ బెర్త్‌ను ఇంగ్లండ్ ఖరారు చేసుకుంది. న్యూజిలాండ్‌తో జరిగిన ఆఖరి లీగ్ మ్యాచ్‌లో 119 పరుగుల తేడాతో విజయం సాధించింది. సొంత గడ్డ మీద ఆతిథ్య బ్రిటిష్ జట్టు తనదైన ఆటతీరును ప్రదర్శించింది. ఇంగ్లండ్ బౌలర్ల ధాటికి కివీస్ బ్యాట్స్‌మెన్ నిలబడలేకపోయారు. ఓపెనర్లు హెన్రీ నికోలస్ డకౌట్ అయ్యాడు, గుప్తిల్ (8 ) పరుగులకే పెవిలియన్ బాట పట్టాడు. కెప్టెన్ విలియంసన్ (27) అనుకోకుండా రనౌట్‌ అయ్యాడు. టేలర్ (28) రాని పరుగు కోసం ప్రయత్నించి రనౌట్ అయ్యాడు. ఆ తర్వాత లాథమ్ ఒక్కడే (57) కొంచెం గౌరవ ప్రదమైన స్కోర్ చేశాడు. ఏ కోశానా లక్ష్య ఛేదనలో న్యూజిలాండ్ వేగంగా ఆడలేకపోయింది. చివరకు 45 ఓవర్లలో 186 పరుగులకు ఆలౌట్ అయింది. ఇంగ్లండ్ బౌలర్లలో మార్క్ ఉడ్ మూడు వికెట్లు పడగొట్టాడు.

అంతకు ముందు ఇంగ్లండ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ఓపెనర్లు రాయ్ (60), బెయిర్ స్టో (106) జట్టుకు శుభారంభాన్నిచ్చారు. కెప్టెన్ మోర్గాన్ (42), జో రూట్ (24) పరుగులు చేశారు. మిగిలిన ఆటగాళ్లు ఫర్వాలేదనిపించారు. దీంతో 50 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 305పరుగులు చేసింది ఇంగ్లండ్. అయితే, ఆరంభంలో బ్రిటిష్ ఆటగాళ్ల బ్యాటింగ్ చూస్తే.. స్కోర్ 400 వరకు వెళ్తుందన్న అభిప్రాయం కనిపించింది. కానీ, చివరి ఓవర్లలో కివీస్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో 305 పరుగులకు పరిమితం అయింది. కివీస్ బౌలర్లలో బోల్ట్, హెర్నీ, నీషామ్ తలో రెండేసి వికెట్లు తీశారు. సాంట్నర్, సౌథీ చెరో వికెట్ పడగొట్టారు.