ప్రపంచకప్‌లో భారత్‌కు వరుసగా రెండో విజయం..!

ప్రపంచ కప్‌లో భారత్‌ కీలక సమరంలో తమ ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. ఆదివారం ఇక్కడి ఓవల్‌ మైదానంలో జరిగిన లీగ్‌ మ్యాచ్‌లో భారత్‌ 36 పరుగుల తేడాతో డిఫెండింగ్‌ చాంపియన్‌ ఆస్ట్రేలియాపై ఘన విజయం సాధించింది. టాస్‌ గెలిచి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన భారత్‌ 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 352 పరుగులు చేసింది. మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ శిఖర్‌ ధావన్‌ కు దక్కింది. సెంచరీతో శిఖర్ చెలరేగగా… విరాట్‌ కోహ్లి 77 బంతుల్లో 82 పరుగులు చేసి స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు. రోహిత్‌ శర్మ , హార్దిక్‌ పాండ్యా భారీ సిక్సర్లతో స్కోరులో కీలక పాత్ర పోషించారు.

అసాధ్యమైన విజయలక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఆస్ట్రేలియాకు సరైన ఆరంభం లభించలేదు. ఓపెనర్లు వార్నర్, ఫించ్‌లు తమ స్వభావానికి విరుద్ధంగా అతి నెమ్మదిగా, జాగ్రత్తగా ఆడటంతో పరుగులు రావడమే గగనమైపోయింది. కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేసిన భువీ, బుమ్రా కలిసి తొలి 7 ఓవర్లలో 19 పరుగులే ఇచ్చారు. అనంతరం పాండ్యా ఓవర్లో ఆసీస్‌ దూకుడు ప్రదర్శించింది. జాదవ్‌ చక్కటి ఫీల్డింగ్‌కు ఫించ్‌ రనౌట్‌ కావడంతో ఆసీస్‌ మొదటి వికెట్‌ కోల్పోయింది. వార్నర్‌ తీవ్రంగా శ్రమించి అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. చివరకు చహల్‌ బౌలింగ్‌లో అతని ఆట ముగిసింది. మరోవైపు స్మిత్‌ క్రీజ్‌లోకి వచ్చిన దగ్గరనుంచి చక్కటి షాట్లతో చకచకా పరుగులు రాబట్టినప్పటికీ ఫలితం దక్కలేదు.

ఈసారి 352 పరుగులు చేసి సవాల్‌ విసిరిన కోహ్లి సేన మళ్లీ ఎలాంటి పొరపాటుకు అవకాశం ఇవ్వలేదు. తమ బౌలింగ్‌ బలగంతో ప్రత్యర్థిని కుప్పకూల్చి ఫేవరెట్‌ హోదాను మరింత పటిష్టం చేసుకుంది. ఐసీసీ టోర్నీల్లో తన అద్భుత ఆటను కొనసాగిస్తూ ధావన్‌ మరో శతకం చేయడం… కోహ్లి, రోహిత్, పాండ్యా అండగా నిలవడం భారత్‌ విజయానికి కారణమయ్యాయి.