ఫైనల్లో భారత జట్టుకు పోటీగా పాక్: గంగూలీ

2019లో ఇంగ్లాండ్ వేదికగా జరగనున్న వరల్డ్ కప్ మ్యాచ్‌‌ను ఉద్దేశించి భారత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ మాట్లాడుతూ.. పాకిస్థాన్ జట్టుపై ప్రశంసల జల్లు కురిపించారు. ఆతిథ్య జట్టు ఇంగ్లాండ్‌తో పాటు ఆస్ట్రేలియా జట్టు సెమీ ఫైనల్‌కి మాత్రమే పరిమితమవుతాయని, ఫైనల్లో భారత జట్టుకు పాకిస్థాన్ పోటీగా నిలిచే అవకాశముందని గంగూలీ పేర్కొన్నారు. వరల్డ్ కప్ మ్యాచ్‌ల్లో పాకిస్థాన్ హాట్ ఫేవరేట్‌గా బరిలోకి దిగుతుందన్నారు. 

ఇంగ్లాండ్ పిచ్‌లపై పాక్ క్రికెటర్లు అద్భుతంగా రాణిస్తారని గంగూలీ పేర్కొన్నారు. మహేంద్రసింగ్ ధోనీ, రోహిత్ శర్మ సేవలు భారత జట్టుకు చాలా అవసరమని తెలిపారు. విరాట్ కోహ్లీ కెప్టెన్సీపై అనుమానం వద్దని, ఐపీఎల్ 12వ సీజన్ వైఫల్యం ప్రపంచ కప్‌పై పడబోదని, వన్డేల్లో కోహ్లీకి మంచి రికార్డ్ ఉందని గంగూలీ స్పష్టం చేశారు.