సమరానికి సిద్దమైన ముంబై, చెన్నై..!

మార్చి 23న మొదలై క్రీడాభిమానులను ఉర్రూతలూగించిన ఐపీఎల్ సీజన్ 12ముగింపు దశకు వచ్చేసింది. ఉప్పల్ వేదికగా జరగనున్న చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్ మ్యాచ్ పూర్తయితే ఇక సీజన్ ముగిసినట్లే. ఓ పక్క కెప్టెన్ కూల్.. మరో వైపు హిట్ మాన్ రోహిత్. ఇరు జట్ల మధ్య బలాబలాలు సమానంగా ఉండడంతో పోటీ రసవత్తరంగా మారనుంది. ఏ క్షణంలోనైనా గేమ్ ను మలుపు తిప్పగల ప్లేయర్లు చెన్నై జట్టులో ఉంటే, క్షణాల్లో మెరుపుల్లాంటి షాట్ లు కురిపించగల సత్తా ఉన్న ఆటగాళ్లు ముంబై సొంతం. భారీ అంచనాల మధ్య, ఉత్కంఠభరితంగా సాగనున్న ఈ పోరు ఎలా ఉండబోతుందనేది సర్వత్రా ఆసక్తిగా మారింది.

మరో వైపు సాయంత్రం జరగనున్న ఫైనల్‌ మ్యాచ్‌ కోసం అన్ని ఏర్పాట్లు చేశామని రాచకొండ సీపీ మహేష్ భగవత్ తెలిపారు. స్టేడియం లోపల, పరిసరాల్లో 300 కెమెరాలు ఏర్పాటు చేసి.. నిత్యం పర్యవేక్షిస్తామని, ఇందుకోసంస్టేడియం లోపల ఒక ప్రత్యేక కమాండ్ కంట్రోల్ సెంటర్‌ను ఏర్పాటు చేశామని తెలిపారు. మొత్తం 2 వేల 850 మంది పోలీసులతో మ్యాచ్‌కు బందోబస్తు ఏర్పాటు చేశామని చెప్పారు. పార్కింగ్ సంబంధించిన వరకు ప్రత్యేక ఏర్పాట్లు చేశామని, ప్రేక్షకుల రద్దీ దృష్టిలో ఉంచుకొని రాత్రి ఒంటిగంట వరకు మెట్రో రైళ్లు నడుపనున్నారని తెలిపారు. స్టేడియం, పిచ్ అంత ఇప్పటికే తనిఖీ చేశామని, నిషేధిత వస్తువులను ఎవ్వరూ మైదానంలోకి తీసుకుసరావొద్దని సూచించారు.