ఐపీఎల్‌ బెట్టింగ్‌లో భారత మహిళల జట్టు మాజీ కోచ్‌ తుషార్‌ ఆరోథ్‌ అరెస్టు

వడోదర: ఐపీఎల్‌ బెట్టింగ్‌లో భారత మహిళల జట్టు మాజీ కోచ్‌, బరోడా మాజీ రంజీ ప్లేయర్‌ తుషార్‌ ఆరోథ్‌ అరెస్టు కావడం క్రికెట్‌ వర్గాల్లో కలకలం సృష్టించింది. సోమవారం రాత్రి ఢిల్లీ క్యాపిటల్స్‌, కింగ్స్‌ లెవెన్‌ పంజాబ్‌ మ్యాచ్‌ సందర్భంగా తుషార్‌.. తన సొంత హోటల్‌ కేఫ్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌లో బెట్టింగ్‌లకు పాల్పడుతుండగా పోలీసులు దాడి చేసి అదుపులోకి తీసుకున్నారు. ఆరోథ్‌తోపాటు అతడి వ్యాపార భాగస్వాములైన హేమంగ్‌ పటేల్‌, నిశ్చల్‌ మిథా సహా 19 మందిని అరెస్టు చేసినట్టు పోలీసులు తెలిపారు. అయితే, అందరినీ బెయిల్‌పై విడుదల చేశారు.

‘కేఫ్‌లో బిగ్‌ స్ర్కీన్‌పై ఐపీఎల్‌ మ్యాచ్‌లను ప్రదర్శిస్తూ బెట్టింగులు జరుపుతున్నారని సమాచారం అందింది. నిఘా పెట్టి దాడులు చేశాం. కేఫ్‌ పక్కన షెడ్లలో ఉన్న కొందరు ఆన్‌లైన్‌ బెట్టింగులు చేస్తున్నార’ని డీసీపీ జయ్‌దీప్‌ సింహ్‌ జడేజా చెప్పారు. 19 మంది నిందితుల మొబైల్‌ ఫోన్లను పరిశీలించగా.. వాటిల్లో మూడు రకాల బెట్టింగ్‌ యాప్‌లు గుర్తించామన్నారు. హేమంగ్‌ ఆన్‌లైన్‌ బెట్టింగులు చేస్తున్నట్టు అంగీకరించాడని తెలిపారు. అరెస్టయిన వారిలో విద్యార్థులు కూడా ఉన్నట్టు చెప్పారు. ఆరోథ్‌ కుమారుడు, బరోడా రంజీ ప్లేయర్‌ రిషి కూడా కేఫ్‌లో భాగస్వామని.. అయితే, రైడ్‌ జరిగినప్పుడు అతడు ఘటనా స్థలంలో లేడని వివరించారు. హేమంగ్‌ లక్షల్లో బెట్టింగ్‌లు కాస్తున్నట్టు విచారణలో తెలిసిందని డీసీపీ పేర్కొన్నారు.

నాకు సంబంధంలేదు..: బెట్టింగులతో తనకు ఎటువంటి సంబంధం లేదని తుషార్‌ చెప్పాడు. ‘నా మొబైల్‌లో పోలీసులకు ఎటువంటి సమాచారం దొరకలేదు. హోటల్‌కు ఎంతో మంది కస్టమర్లు వస్తుంటారు. వారు ఏం చేస్తున్నారనేది నాకు ఎలా తెలుస్తుంది. ఇక హేమంగ్‌ విషయానికొస్తే అతడు పార్ట్‌నర్‌ అయినా.. ఎక్కువగా తన స్నేహితులతోనే ఉంటాడు. ఏం చేస్తున్నాడనేది కూడా నాకు తెలియదు. నేను ఎటువంటి చట్ట విరుద్ధ కార్యకలాపాలకూ పాల్పడలేద’ని తుషార్‌ చెప్పాడు. కానీ, పందాలు కాసేవారికి తుషార్‌ తగిన సౌకర్యాలు సమకూర్చుతున్నట్టు పోలీసులు అనుమానిస్తున్నారు.