మూడో విజయాన్ని అందుకున్న పంజాబ్

సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ టీమ్ మరోసారి ఛేదనలో తన డొల్లతనాన్ని బయటపెట్టింది. కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌తో మొహాలి వేదికగా సోమవారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో 167 పరుగుల లక్ష్యఛేదనకు దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ ఆఖర్లో ఒత్తిడికి గురై వరుసగా వికెట్లు చేజార్చుకుని 14 పరుగుల తేడాతో ఓడిపోయింది. ఛేదనలో ఢిల్లీ జట్టు విజయానికి ఆఖరి 24 బంతుల్లో 30 పరుగులు అవసరమవగా.. అప్పటికి చేతిలో 7 వికెట్లు ఉన్నాయి. కానీ.. 137/3 నుంచి వరుసగా రిషబ్ పంత్ (39: 26 బంతుల్లో 3×4, 2×6), ఇంగ్రామ్ (38: 29 బంతుల్లో 4×4, 1×6)తో పాటు మోరీస్ (0), హనుమ విహారి (0), హర్షల్ పటేల్ (0), రబాడ (0), సందీప్ (0) వికెట్లు చేజార్చుకున్న ఆ జట్టు 19.2 ఓవర్లలోనే 152 పరుగులకి ఆలౌటైంది. పంజాబ్ ఫాస్ట్ బౌలర్ శామ్ కరన్ (4/11) డెత్ ఓవర్లలో హ్యాట్రిక్ వికెట్లు పడగొట్టి.. పంజాబ్‌ని గెలిపించాడు. దీంతో.. కరన్‌కే మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. 

అంతకముందు టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టు‌లో ఓపెనర్లు లోకేశ్ రాహుల్ (15: 11 బంతుల్లో 2×4, 1×6), శామ్ కరన్ (20: 10 బంతుల్లో 3×4, 1×6)తో మయాంక్ అగర్వాల్ (6) నిరాశపరిచాడు. కానీ.. మిడిల్ ఓవర్లలో డేవిడ్ మిల్లర్ (43: 30 బంతుల్లో 4×4, 2×6), సర్ఫరాజ్ ఖాన్ (39: 29 బంతుల్లో 6×4), ఆఖర్లో మన్‌దీప్ సింగ్ (29 నాటౌట్: 21 బంతుల్లో 2×4, 1×6) నిలకడగా ఆడటంతో ఆ జట్టు 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 166 పరుగులు చేయగలిగింది. ఢిల్లీ బౌలర్లలో మోరీస్ మూడు వికెట్లు పడగొట్టగా.. రబాడ, స్పిన్నర్ సందీప్ చెరో రెండు వికెట్లు తీశారు. మయాంక్ అగర్వాల్ , మహ్మద్ షమీ (0) రనౌటయ్యారు. 

ఢిల్లీ తుది జట్టులో ఒక మార్పు జరిగింది. స్పిన్నర్ అమిత్ మిశ్రాపై వేటు వేసిన శ్రేయాస్.. ఫాస్ట్ బౌలర్ అవేశ్ ఖాన్‌ని జట్టులోకి తీసుకున్నాడు. మరోవైపు పంజాబ్ జట్టు.. ఈ మ్యాచ్‌కి ఓపెనర్‌ క్రిస్‌గేల్‌కు రెస్ట్ ఇచ్చింది.