టీ20 సిరీసే కాదు.. వన్డే సిరీస్‌లోనూ కోహ్లీసేనకు ఓటమే. .

ప్రపంచకప్ ముంగిట భారత్ జట్టు కీలకమైన వన్డే సిరీస్‌ని చేజార్చుకుంది. ఆస్ట్రేలియాతో బుధవారం ముగిసిన ఐదు వన్డేల సిరీస్‌ను వరుసగా రెండు ఘన విజయాలతో ఆరంభించిన టీమిండియా.. ఆ తర్వాత ప్రయోగాల వెంట పరుగెత్తి చివరి మూడు వన్డేల్లోనూ ఓడిపోయింది. ఢిల్లీలోని ఫిరోజ్ షా కోట్ల వేదికగా బుధవారం రాత్రి ముగిసిన విజేత నిర్ణయాత్మక ఆఖరి వన్డేలో తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా జట్టు 272 పరుగులు చేయగా.. లక్ష్య ఛేదనలో తడబడిన కోహ్లీసేన 237 పరుగులకే కుప్పకూలిపోయింది. దీంతో.. 35 పరుగుల తేడాతో విజయాన్ని అందుకున్న కంగారూలు.. సిరీస్‌ను 3-2తో చేజిక్కించుకున్నారు. చివరి రెండు వన్డేల్లోనూ వికెట్ కీపర్ మహేంద్రసింగ్ ధోనీకి రెస్ట్ ఇవ్వడం భారత్‌ని దారుణంగా దెబ్బతీసింది

లక్ష్యఛేదనలో భారత్‌కి శుభారంభం లభించలేదు. ఆరంభంలోనే ఓపెనర్ శిఖర్ ధావన్ (12: 15 బంతుల్లో 2×4), కెప్టెన్ విరాట్ కోహ్లి (20: 22 బంతుల్లో 2×4) పేలవంగా వికెట్లు చేజార్చుకోగా.. ఆ తర్వాత వచ్చిన రిషబ్ పంత్ (16: 16 బంతుల్లో 1×4, 1×6), విజయ్ శంకర్ (16: 21 బంతుల్లో 1×6) నిరాశపరిచారు. కానీ.. ఒంటరిగా పోరాడిన ఓపెనర్ రోహిత్ శర్మ (56: 89 బంతుల్లో 4×4) అర్ధశతకంతో జట్టులో గెలుపు ఆశలు రేపాడు. కానీ.. జట్టు స్కోరు 132 వద్ద అతను ఔటవగా. తర్వాత వచ్చిన జడేజా (0) డకౌటయ్యాడు. దీంతో.. 28.5 ఓవర్లు ముగిసే సమయానికి భారత్ 132/6తో పీకల్లోతు కష్టాల్లో నిలిచింది. ఈ దశలో అసాధారణంగా ఆడిన కేదార్ జాదవ్ (44: 57 బంతుల్లో 4×4, 1×6), భువనేశ్వర్ కుమార్ (46: 54 బంతుల్లో 2×4, 1×6) జోడీ.. మళ్లీ గెలుపు ఆశలు రేపారు. కానీ.. స్లాగ్ ఓవర్లలో ఇద్దరినీ వరుస ఓవర్లలో పెవిలియన్ బాట పట్టించిన ఆస్ట్రేలియా.. ఆఖరి బంతికి భారత్‌ను ఆలౌట్ చేసింది.

అంతకముందు ఆస్ట్రేలియా ఓపెనర్ ఉస్మాన్ ఖవాజా (100: 106 బంతుల్లో 10×4, 2×6) శతకం సాధించినా.. స్లాగ్ ఓవర్లలో పుంజుకున్న భారత్ బౌలర్లు ఆ జట్టుని 272/9కే పరిమితం చేశారు. టీమిండియా బౌలర్లలో భువనేశ్వర్ కుమార్ (3/48), జడేజా (2/45), మహ్మద్ షమీ (2/57) సత్తాచాటగా.. జస్‌ప్రీత్ బుమ్రా (0/39) పొదుపు బౌలింగ్‌తో ఆకట్టుకున్నాడు. ఆ జట్టులో ఖవాజాతో పాటు హ్యాండ్స్‌కబ్ (52: 60 బంతుల్లో 4×4) అర్ధశతకంతో సత్తాచాటగా.. గత వన్డేలో ఒంటిచేత్తో ఆ జట్టుని గెలిపించిన టర్నర్ (20: 20 బంతుల్లో 2×4, 1×6) ఈరోజు తక్కువ స్కోరుకే ఔటయ్యాడు.