ఏమైందీ మన జట్టుకి?

ఓవైపు వరుస విజయాలు.. మరోవైపు ప్రధాన ఆటగాళ్ల చక్కటి ఫామ్‌.. బ్యాటింగ్‌, బౌలింగ్‌, ఫీల్డింగ్‌ అన్నింట్లోనూ అత్యుత్తమ ప్రదర్శన.. దీర్ఘకాలంగా జట్టును వేధిస్తున్న సమస్యలూ పరిష్కారమయ్యాయి.. ప్రపంచకప్‌ ముంగిట ఏ జట్టుకైనా ఇంతకంటే ఏం కావాలి? నెల కిందట న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్‌ ముగిసే సమయానికి టీమ్‌ఇండియా మామూలు ఊపులో లేదు. ఆస్ట్రేలియాను టెస్టులు, వన్డేల్లో మట్టి కరిపించి.. అదే ఊపును న్యూజిలాండ్‌లోనూ కొనసాగిస్తూ 4-1తో సిరీస్‌ సాధించిన భారత్‌ను.. ప్రపంచ అత్యుత్తమ క్రికెట్‌ జట్టుగా పేర్కొన్నారు విశ్లేషకులు.
టీమ్‌ఇండియా ప్రపంచకప్‌ హాట్‌ ఫేవరెట్‌ అని కూడా తీర్మానించారు. బౌలర్లు భారత క్రికెట్‌ చరిత్రలోనే ఎన్నడూ లేనంత గొప్ప నిలకడ చూపించారు. ఒక సిరీస్‌లో షమి, మరో సిరీస్‌లో బుమ్రా లేకున్నా.. బౌలింగ్‌కు ఢోకా లేకపోయింది. మరోవైపు బ్యాటింగ్‌ బలం అంతకంతకూ పెరిగింది. దీర్ఘకాలిక మిడిలార్డర్‌ సమస్య కూడా పరిష్కారమైంది. ఈ ఊపు కొనసాగితే ప్రపంచకప్‌లో కోహ్లీసేనకు ఎదురుండదనే అనుకున్నారంతా. కానీ న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్‌ నుంచి కథ మారిపోయింది.
అనూహ్యంగా ఆ సిరీస్‌ ఓడిన భారత్‌.. తర్వాత సొంతగడ్డపై ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్‌నూ కోల్పోయింది. ఐతే వన్డేలే ప్రధానం కాబట్టి ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో టీమ్‌ఇండియా తన స్థాయిని చాటుతుందని అభిమానులు ఆశించారు. కానీ తొలి రెండు వన్డేల్లో కంగారూల నుంచి గట్టి ప్రతిఘటనే ఎదురైంది. అయినప్పటికీ ఎలాగోలా గెలిచి ఊపిరి పీల్చుకుంది. కానీ అనూహ్యంగా వరుసగా మూడు మ్యాచ్‌ల్లో ఓడి సిరీస్‌ను సమర్పించుకుంది. ఈ ఓటముల కంటే కూడా జట్టులో నిలకడ లేమి భారత్‌ను ఎక్కువ కంగారు పెడుతోందిప్పుడు.