పాక్ చిత్తు.. ఫైనల్ లో బంగ్లా..!

పాకిస్తాన్ ను మట్టి కరిపించి బాంగ్లాదేశ్ ఆసియాకప్‌ ఫైనల్లో భారత్ కు ప్రత్యర్థిగా అడుగుపెట్టింది. బుధవారం సూపర్ ఫోర్లో భాగంగా జరిగిన మ్యాచ్‌లో ఆ జట్టు 37 పరుగుల తేడాతో పాకిస్థాన్‌పై విజయం సాధించింది.

మొదట బాటింగ్ చేసిన బంగ్లా 48.5 ఓవర్లలో 239 పరుగులు సాధించింది. ముష్ఫికర్‌ రహీమ్‌ (99), మహ్మద్‌ మిథున్‌ (60) రాణించారు. పాక్ బౌలర్ జునైద్‌ ఖాన్‌ 4 వికెట్లు తీసాడు. జునైద్‌ ధాటికి మ్యాచ్ ఆరంభంలో బంగ్లాదేశ్ 12 పరుగులకే మూడు వికెట్లు చేజార్చుకుంది. ముష్ఫికర్‌, మిథున్‌ నాలుగో వికెట్‌కు 144 పరుగులు జోడించడంతో బంగ్లా నిలదొక్కుకుంది.

ఇక విజయం కోసం బరిలోకి దిగిన పాకిస్థాన్‌ బంగ్లా బౌలర్ల ధాటికి చేతులెత్తేసింది. ఇమాముల్‌ హక్‌ (83) ఒక్కడే రాణించాడు. ముస్తాఫిజుర్‌ రెహ్మాన్‌ (4) వికెట్లు సాధించాడు. శుక్రవారం భారత్‌తో బంగ్లా ఫైనల్ మాచ్ ఆడనుంది. ఆసియా కప్ లో భారత్ తో ఫైనల్ లో తలపడడం బంగ్లాకు ఇది రెండోసారి.