పెళ్లి చేసుకోవాలంటే శుభలేఖలపై పుట్టినరోజు ఉండాలిసిందే !

221

అధికారులు ఎంతగా అవగాహన కార్యక్రమాలు చేపట్టినా, ప్రభుత్వాలు ఎలాంటి కఠిన చట్టాలు తీసుకొచ్చినా దేశంలో బాల్య వివాహాలు ఆగడం లేదు. ఈ నేపథ్యంలో రాజస్థాన్ లోని బుండీ జిల్లా అధికారులు వినూత్నంగా ఆలోచించారు. వివాహం సందర్భంగా పెళ్లి పత్రికల్లో వరుడు, వధువు పుట్టిన తేదీని ముద్రించాలని ఆదేశించారు. ఈ మేరకు జిల్లాలోని ప్రింటింగ్‌ ప్రెస్‌ యాజమాన్యాలకు కూడా ఆదేశాలు జారీచేశారు. బాల్య వివాహాలు చేయడం చట్టరీత్యా నేరమని హెచ్చరించారు.

రాజస్థాన్‌లో సాధారణంగా అక్షయ తృతీయ రోజున ఎక్కువ బాల్య వివాహాలు జరుగుతుంటాయి. ఈ నేపథ్యంలో వచ్చే నెల 7న అక్షయ తృతీయ రోజు నుంచి దీన్ని అమలు చేయాలని అధికారులు నిర్ణయించారు. ఇందులో భాగంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు, భూరికార్టుల ఇన్‌స్పెక్టర్ల ఆధ్వర్యంలో ఏర్పాటు అయిన టీమ్ లు ఊర్లలో బాల్య వివాహాలపై ఓ కన్నేసి ఉంచుతాయి.

ఇంటికి రంగులు వేయడం, అమ్మాయిల అరచేతిపై గోరింటాకు పెట్టడం, పెళ్లి భాజాలు మోగించడం, అర్చకులు, వాహనాలను బుక్‌ చేయడం వంటి కార్యకలాపాలపై ఈ బృందాలు నిఘా పెట్టనున్నాయి.