భీమా-కోరెగావ్‌ కేసు ఎన్‌ఐఏకు..!

12

భీమా- కోరెగావ్‌ కేసు జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ)కు బదిలీ అయింది. ఈ కేసు దర్యాప్తును పుణె పోలీసుల నుంచి తమకు అప్పగించాలని ఎన్‌ఐఏ కోరడం… దీనికి అభ్యంతరం లేదని మహారాష్ట్ర ప్రభుత్వం తెలపడంతో పుణె కోర్టు శుక్రవారం ‘బదిలీ’ ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటి వరకు పుణె కోర్టు ఈ కేసును విచారించింది. ఈ కేసుకు సంబంధించిన రికార్డులు, ప్రొసీడింగ్‌లు, పోలీసులు స్వాధీనం చేసుకున్న ఆయుధాలు, వస్తువులను ముంబైలోని ప్రత్యేక ఎన్‌ఐఏ కోర్టుకు తరలించాలని, నిందితులందర్నీ ఈ నెల 28లోపు ఆ కోర్టులో హాజరుపరచాలని పుణె కోర్టు అడిషనల్‌ సెషన్స్‌ జడ్జి ఆదేశించారు. ఎన్‌ఐఏకు బదలాయించడానికి గత నెలలో ఒప్పుకోని ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రే… ఇప్పుడు అభ్యంతరం లేదనడం విశేషం. ఠాక్రే నిర్ణయంపై ఎన్సీపీ అధినేత శరద్‌ పవార్‌ అసంతృప్తి వ్యక్తం చేశారు.సేన-ఎన్సీపీ-కాంగ్రె్‌సతో కూడిన మహారాష్ట్ర వికాస్‌ అఘాడీ ప్రభుత్వం ఏర్పాటయ్యాక ఉద్ధవ్‌ను పవార్‌ విమర్శించడం ఇదే తొలిసారి. ‘‘దర్యాప్తును ఇలా రాష్ట్రం చేతుల్లోంచి కేంద్రం తీసేసుకోవడం తప్పు. వారి నిర్ణయానికి మహారాష్ట్ర ప్రభుత్వం మద్దతు ఇవ్వడం కూడా తప్పే’’ అని పవార్‌ మండిపడ్డారు. తన అభిప్రాయాన్ని పట్టించుకోకుండా కేసు బదిలీకి ముఖ్యమంత్రి ఆమోదం తెలిపారని ఎన్సీపీకి చెందిన రాష్ట్ర హోం మంత్రి అనిల్‌ దేశ్‌ముఖ్‌ తెలిపారు. బీజేపీతో అవగాహనకు వచ్చాకే కేసు బదిలీకి ఉద్ధవ్‌ గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చారని ఆరోపణలు వినిపిస్తున్నాయి.