ఏటీఎం విత్‌డ్రా.. మరింత భారం..!

82

ఇకపై ఏటీఎంలలో నగదు విత్‌ డ్రా, బ్యాలెన్స్‌ చెక్‌ చేసుకోవడం మరింత భారం కానుందా అంటే అవుననే సంకేతాలు కన్పిస్తున్నాయి. ఇంటర్‌ఛేంజ్‌ ఫీజు పెంచాలని కోరుతూ భారత ఏటీఎం ఆపరేటర్ల సంఘం ఇటీవల రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాకు లేఖ రాసింది. ఇందుకు కేంద్ర బ్యాంక్‌ కూడా సానుకూలంగా స్పందించే అవకాశాలున్నట్లు ఓ జాతీయ మీడియా కథనం వెల్లడించింది. ప్రస్తుతం ఒక బ్యాంక్‌ కార్డును వేరే బ్యాంక్‌కు చెందిన ఏటీఎంలో వినియోగించినప్పుడు సదరు ఏటీఎం ఆపరేటర్‌కు ఖాతాదారుడు ఇంటర్‌ఛేంజ్‌ ఫీజు చెల్లించాల్సిన విషయం తెలిసిందే. కస్టమర్లకు ఐదు ట్రాన్సాక్షన్లను ఉచితంగా అందిస్తూ ఆ పైన జరిగే లావాదేవీలకు కొంత మొత్తంలో ఫీజు వసూలు చేస్తున్నారు. పరిమితి దాటిన తర్వాత చేసే నగదు ట్రాన్సాక్షన్‌ల(విత్‌డ్రా)పై రూ. 15, నగదు రహిత ట్రాన్సాక్షన్‌ల(బ్యాలెన్స్‌ ఎంక్వైరీ)పై రూ. 5 చొప్పున ఈ ఛార్జీలు ఉన్నాయి. అయితే ఈ ఇంటర్‌ఛేంజ్‌ ఫీజులను పెంచాలని కోరుతూ ఏటీఎం ఆపరేటర్ల సంఘం ఈ నెల 13న ఆర్‌బీఐకి ఓ లేఖ రాసింది. ఏటీఎం భద్రత, నిర్వహణ ప్రమాణాలను ఆర్‌బీఐ పెంచిన నేపథ్యంలో ఏటీఎంల నిర్వహణ ఖర్చు పెరిగిందని.. దీని వల్ల తమ వ్యాపారాలు దెబ్బతింటున్నాయని ఆపరేటర్లు లేఖలో పేర్కొన్నారు. ఈ పరిణామాల వల్ల కొత్త ఏటీఎంలను కూడా ఏర్పాటు చేయలేకపోతున్నామని తెలిపారు. అందుకే ఆదాయాన్ని పెంచుకోవాలనుకుంటున్నామని చెప్పారు.