నా అంచనాలు తప్పాయి..!

17

కొందరు నేతల విద్వేషపూరిత వ్యాఖ్యల వల్లే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ నష్టపోయి ఉండవచ్చని కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా అభిప్రాయపడ్డారు. ప్రచారం సందర్భంగా ‘గోలీ మారో’.. ‘ఇండో-పాక్‌ మ్యాచ్‌’ అంటూ కొందరు చేసిన వ్యాఖ్యలు బీజేపీ ఓటమికి కారణమై ఉండొచ్చన్నారు. ఫలితాలు వచ్చిన మూడు రోజుల తర్వాత గురువారం ఓ న్యూస్‌ చానల్‌ సదస్సులో ఆయన ఢిల్లీ ఎన్నికలపై స్పందించారు. బీజేపీ విజయంపై తన అంచనాలు తప్పాయని అంగీకరించారు. చాలా సందర్భాల్లో తన అంచనాలు నిజమయ్యాయని, ఢిల్లీలో మాత్రం తాను అనుకున్నన్ని సీట్లు సాధించలేకపోయామని ఆవేదన చెందారు. ఈ ఎన్నికల్లో పేలవ ప్రదర్శనపై పార్టీలో సమీక్షించుకున్నామని చెప్పారు. బీజేపీ భావజాలాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఈ ఎన్నికలను ఉపయోగించుకున్నామని షా విశ్లేషించారు. ‘బహూ బేటియోంకా బలాత్కార్‌ కరేంగే’ (కోడళ్లు, కూతుళ్లపై అత్యాచారం చేస్తాం) అని ఎవరూ అనలేదని షా వివరణ ఇచ్చారు. ఇలాంటి విద్వేషపూరిత వ్యాఖ్యలకు పార్టీతో సంబంధం లేదని అప్పుడే స్పష్టం చేశామని గుర్తు చేశారు.