జేఎన్‌యూలో దాడి’ డేటా పై స్పందించండి

10

జవహర్‌లాల్‌ నెహ్రూ విశ్వవిద్యాలయం (జేఎన్‌యూ)లో దుండగుల దాడికి సంబంధించిన వివరాలు, సీసీటీవీ ఫుటేజీలు, సామాజిక వేదికల్లో నడిచిన సంభాషణలను భద్రపరిచే విషయమై స్పందించాలని… రాష్ట్ర ప్రభుత్వం, పోలీసులతో పాటు వాట్సప్‌, గూగుల్‌, యాపిల్‌ యాజమాన్యాలను దిల్లీ హైకోర్టు ఆదేశించింది. ఈ అంశంపై వర్సిటీ ప్రొఫెసర్లు కొందరు వ్యాజ్యం దాఖలు చేయగా, జస్టిస్‌ బ్రిజేశ్‌ సేథ్‌ నేతృత్వంలోని ధర్మాసనం సోమవారం విచారణ చేపట్టింది. దాడి జరగడానికి ముందు ‘యూనిటీ ఎగనెస్ట్‌ లెఫ్ట్‌’, ‘ఫ్రెండ్స్‌ ఆఫ్‌ ఆర్‌ఎస్‌ఎస్‌’ వాట్సప్‌ గ్రూపుల్లో చర్చలు జరిగాయని… ఈ సంభాషణలను, వాటిని జరిపినవారి వివరాలను సమర్పించేలా ఆదేశాలివ్వాలని పిటిషనర్లు అభ్యర్థించారు. ఇప్పటికే తాము క్యాంపస్‌లోని 135 సీసీటీవీల డేటాను సమర్పించాలని వర్సిటీ అధికారులను కోరామని, అయితే అక్కడి నుంచి ఎలాంటి సమాచారం అందలేదని దిల్లీ పోలీసులు కోర్టు దృష్టికి తెచ్చారు.