పాక్‌కి అనుకూలంగా లేని అంతర్జాతీయ స్పందనలు..!

210

 రండి.. అందరూ రండి.. ఈ అన్యాయాన్ని చూడండి.. ఖండించండి.. ఎవరైనా అడ్డుకోండి.. అంటూ కశ్మీర్‌పై పాకిస్థాన్‌ చేసిన ప్రకటనలను అంతర్జాతీయ సమాజం అంతగా పట్టించుకోలేదు. ఓఐసీ (ఆర్గనైజేషన్‌ ఆఫ్‌ ఇస్లామిక్‌ కోఆపరేషన్‌, ఏవో ఒకటి రెండు దేశాలు పాకిస్థాన్‌కు అనుకూలంగా మాట్లాడినా.. పెద్దగా ప్రయోజనం లేదు. బాగా నమ్ముకొన్న కొన్ని దేశాలైతే పాక్‌కు షాక్ ఇచ్చాయి కూడా. కశ్మీర్‌లో భారత ప్రభుత్వం ఆర్టికల్‌ 370 రద్దు చేయడంపై ప్రపంచ వ్యాప్తంగా పెద్దగా స్పందనలు లేవు. అంతర్జాతీయ సమాజం భారత్‌ను తప్పుపడుతుందని ఆశించిన పాక్‌కు ఈ విషయంలో చుక్కెదురైంది. భారత్‌ నిర్ణయం వెలువడిన వెంటనే విదేశాంగ శాఖ అంతర్జాతీయంగా ఎటువంటి వ్యతిరేకత రాకుండా నిశ్శబ్దంగా తన పని తాను చేసుకుపోయింది. అత్యంత శక్తివంతమైన పీ5 దేశాల (అమెరికా, రష్యా, చైనా, యూకే, ఫ్రాన్స్‌) రాయబారులను ఆహ్వానించి కశ్మీర్‌పై భారత ప్రభుత్వం తీసుకొన్న నిర్ణయాన్ని వెల్లడించింది. వీటిల్లో ఒక్క చైనా మినహా భారత్‌కు వ్యతిరేకంగా మరే దేశం ప్రకటన చేయలేదు.

అంతర్జాతీయంగా పాక్‌కు అనేక సందర్భాల్లో మద్దతిచ్చిన చైనా, కశ్మీర్‌ అంశంపై చాలా జాగ్రత్తగా స్పందించింది. భారత్‌ లద్దాఖ్‌ను కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటించడంపైనే తన దృష్టిని ఎక్కువగా కేంద్రీకరించింది. లద్దాఖ్‌ను కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటించడం ద్వారా చైనా సార్వభౌమాధికారాన్ని ధిక్కరించే పని భారత్‌ చేస్తోందని పేర్కొంది. అయితే కశ్మీర్‌ని ద్వైపాక్షిక అంశంగా ప్రస్తావించింది. కశ్మీర్‌లో యథాతథ స్థితి కొనసాగాలంది. చైనా నుంచి ఇటువంటి స్పందనను భారత్‌ ముందే ఊహించింది. అందుకే వెంటనే ప్రతిస్పందనను భారత విదేశాంగ శాఖ వెల్లడించింది. ‘మా అంతర్గత వ్యవహారాల్లో తలదూర్చవద్దు’ అని తేల్చి చెప్పింది. 
పాక్‌తో ఉన్న సంబంధాల కారణంగా టర్కీ మాత్రం కశ్మీర్‌లో భారత్‌ తీరుపై ఆందోళన వ్యక్తం చేసింది. ఫైనాన్షియల్‌ యాక్షన్‌ టాస్క్‌ ఫోర్స్‌ (ఎఫ్‌ఏటీఎఫ్‌)లో కూడా పాక్‌ను వెనకేసుకొచ్చిన అతికొద్ది దేశాల్లో టర్కీ ఒకటి. దీనికి తోడు ఆర్టికల్‌ 370ని భారత్‌ తొలగించగానే పాక్‌ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ టర్కీ అధ్యక్షుడు ఎర్డగాన్‌కు ఫోన్‌ చేసి మద్దతు కోరారు.

ఇస్లాం దేశాల్లో చాలా కీలకమైన యూఏఈ కశ్మీర్‌లో ఆర్టికల్‌ 370 తొలగింపుపై భారత్‌కు మద్దతుగా నిలిచింది. ఈ చర్య వల్ల జమ్ము, కశ్మీర్‌లో సామాజిక, ఆర్థిక పరిస్థితులు మెరుగవుతాయని ఆ దేశ రాయబారి డాక్టర్‌ అల్‌ బన్నా పేర్కొన్నారు. పాక్‌కు ఆర్థికంగా అండగా నిలబడే యూఏఈ కశ్మీర్‌ విషయంలో భారత్‌కు మద్దతు పలకడం విశేషం. ఒక పక్క ఆర్గనైజేషన్‌ ఆఫ్‌ ఇస్లామిక్‌ కోఆపరేషన్‌( ఓఐసీ) ఆర్టికల్‌ 370 రద్దును ఖండించినా .. యూఏఈ మాత్రం మద్దతు తెలిపింది.

అగ్రరాజ్యం అమెరికా పాకిస్థాన్‌కు ఏకంగా షాక్‌ ఇచ్చింది. అఫ్గానిస్థాన్‌లో సైనికుల ఉపసంహరణకు తమ సాయం అమెరికాకు అవసరం కావడంతో పాక్‌ ఆ దేశంపై ఆశలు పెట్టుకొంది. కానీ, అమెరికా మాత్రం ఆర్టికల్‌ 370 ఉపసంహరణ భారత అంతర్గత వ్యవహారమని తేల్చిచెప్పింది. ఈ మేరకు డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ స్టేట్‌ ప్రతినిధి ట్వీట్‌ చేశారు. ఇక్కడ పాక్‌ ఒక విషయాన్ని మర్చిపోయింది. అమెరికాకు అఫ్గాన్‌లో పాక్‌ సాయం ఎంత అవసరమో.. చైనా కట్టడికి భారత్‌ సాయం అంతకంటే ఎక్కువ అవసరం. ఈ నేపథ్యంలో అగ్రరాజ్యం భారత్‌తో దౌత్య, వ్యాపార సంబంధాలను దెబ్బతీసుకోవడానికి ఇష్టపడలేదు. పరిస్థితులను దగ్గరగా గమనిస్తున్నామని మాత్రం వెల్లడించింది. దీంతో యూరోపియన్‌ యూనియన్‌లోని చాలా దేశాలు అమెరికా పాలసీనే అనుసరిస్తాయనేది కాదనలేని వాస్తవం. నెదర్లాండ్స్‌ నేరుగా భారత్‌కు మద్దతు ప్రకటించింది. పాక్‌ను ఉగ్రదేశంగా అభివర్ణించింది. శ్రీలంక కూడా పాక్‌కు మద్దతు తెలపలేదు. ఆర్టికల్‌ 370 తొలగింపు భారత్‌ అంతర్గత వ్యవహారమని పేర్కొంటూనే.. బౌద్ధుల మెజార్టీతో లద్దాక్‌ను కేంద్రపాలిత ప్రాంతంగా చేయడంపై హర్షం వ్యక్తం చేసింది.

ఇక బ్రిటన్‌ మాత్రం పరిస్థితిని దగ్గరగా గమనిస్తున్నామని పేర్కొంది. ఆ దేశంలో అంతర్గతంగా భారత్‌, పాక్‌ అనుకూల రాజకీయ నేతలను మౌనంగా ఉండాలని సూచించింది. మరోపక్క ఫ్రాన్స్‌, రష్యాల నుంచి కశ్మీర్‌ అంశంపై ఎటువంటి స్పందనా రాలేదు. ఇప్పటికే ఈ రెండు దేశాలు భారత్‌కు భారీగా ఆయుధాలను ఎగుమతి చేస్తుండటం, పటిష్ఠమైన వ్యాపార సంబంధాలు కొనసాగిస్తుండటంతో పూర్తిగా మౌనం పాటించాయి. భారత్‌ తీరును ఐరాస ఎండగడుతుందని ఆశించిన పాక్‌కు తీవ్ర నిరాశే ఎదురైంది. ఐరాస కూడా ఇరు పక్షాలు సంయమనం పాటించాలని కోరింది. అంతర్జాతీయ సమాజం నుంచి ఎంతకూ ఆశించిన స్థాయిలో స్పందనలు రాకపోవడంతో నిస్పృహలో కూరుకుపోయిన పాక్‌ నిన్న భారత్‌తో వాణిజ్య సంబంధాలను తెగ్గొట్టుకొంది.