మాకూ ప్రత్యేక హోదా ఇవ్వండి:ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్

ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ఈరోజు ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశమయ్యారు. ఢిల్లీకి చేరుకున్న పట్నాయక్ సార్వత్రిక ఎన్నికల్లో విజయదుందుభి మోగించిన మోదీకి శుభాకాంక్షలు చెప్పారు. ఇటీవల వచ్చిన ఫొని తుపాను కారణంగా ఒడిశా తీవ్రంగా నష్టపోయిందని పట్నాయక్ మోదీ దృష్టికి తీసుకొచ్చారు.

తమ రాష్ట్రం ఆర్థికంగా వెనుకపడి ఉందన్నారు. కాబట్టి ఒడిశా శరవేగంగా అభివృద్ధి సాధించేందుకు వీలుగా ప్రత్యేక హోదాను ఇవ్వాలని కోరారు. ఓవైపు తమకు ప్రత్యేక హోదా ఇవ్వాలని ఏపీ ముఖ్యమంత్రి జగన్ ప్రధాని మోదీని కోరుతున్న నేపథ్యంలో పట్నాయక్ కూడా అదే పాటను అందుకోవడం గమనార్హం.

ఇటీవల ముగిసిన లోక్ సభ ఎన్నికల్లో ఒడిశాలోని 21 స్థానాలకు గానూ పట్నాయక్ నేతృత్వంలోని బిజూజనతాదళ్ 12 సీట్లు దక్కించుకోగా, బీజేపీ 8 స్థానాలతో రెండో స్థానంలో, కాంగ్రెస్ ఓ సీటుతో మూడోస్థానంలో నిలిచాయి. అలాగే 147 స్థానాలున్న ఒడిశా అసెంబ్లీలో బీజూ జనతాదళ్ అభ్యర్థులు 112 స్థానాల్లో ఘనవిజయం సాధించారు.