ఉత్తరప్రదేశ్ లో వర్షం భీభత్సం..!

ఉత్తరప్రదేశ్ లోని మెయిన్ పురి జిల్లాలో భారీ వర్షం భీభత్సం సృష్టించింది. వర్షం తో పాటు.. వీచిన పెనుగాలులకు 26 మంది మృతి చెందారు. మరో 57 మంది తీవ్రంగా గాయపడ్డారు. భారీ వర్షంతో పాటు వీచిన గాలులతో చెట్లు, విద్యుత్ స్థంబాలు నేలకొరిగాయి. దీంతో జాతీయ రహదారిపై వాహన రాకపోకలు నిలిచిపోయాయి. పలు పట్టణాల్లోని హోర్డింగులు గాలికి నేలకూలాయి. మట్టితో నిర్మించిన ఇళ్లు కూలిపోవడం వల్ల పలువురు మృత్యువాత పడ్డారు. మెరుపులు, ఉరుములతో కూడిన వర్షంతోపాటు పిడుగులు పడటం వల్ల మరికొందరు మరణించారని యూపీ పునరావాస కమిషనర్ చెప్పారు. ఈ విపత్తులో 31 పశువులు మరణించాయని… 16 ఇళ్లు కూలిపోయాయని అధికారులు చెప్పారు. ఇక లక్నో నగరంతో పాటు పలు ప్రాంతాల్లో విద్యుత్ లైన్లు దెబ్బతిన్నాయని పలు ప్రాంతాల్లో గాలిదుమారం వల్ల పలువురు గాయపడ్డారని ప్రభుత్వ అధికారులు చెప్పారు. యూపీలో విపత్తు వల్ల దెబ్బతిన్న ప్రాంతాల్లో సహాయపునరావాస పనులు చేపట్టాలని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ అధికారులను ఆదేశించారు. మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి .4లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందించాలని సీఎం యోగి చెప్పారు.