సూడాన్‌లో 101 మంది మృతి..!

సూడాన్‌లో ప్రజాస్వామ్య అనుకూల నిరసన తీవ్ర రక్తపాతానికి దారితీసింది. మిలిటరీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు చేపట్టినవారిపై జరిపిన కాల్పుల్లో 101 మంది ప్రాణాలు కోల్పోయారు. వందల మంది గాయపడ్డారు. వీరంతా నెల రోజులుగా సూడాన్‌ రాజధాని ఖార్తూమ్‌లో ఆందోళన సాగిస్తున్నారు. దేశ ఆర్థిక రంగం పూర్తిగా చితికిపోవడంతో ఏడాది క్రితం అప్పటి అధ్యక్షుడు బషీర్‌ అత్యవసర పొదుపు చర్యలు ప్రకటించారు. అనేక నిత్యావసరాల వాడుకపై నిషేధ ఆంక్షలు విధించారు. దీన్ని నిరసిస్తూ ప్రజలు ఉద్యమం చేపట్టారు. ఇవి పతాక స్థాయికి చేరడంతో సైన్యం జోక్యం చేసుకొని 30 ఏళ్లుగా ఉన్న బషీర్‌ను తొలగించి దేశాన్ని తన అధీనంలోకి తీసుకుంది. మిలటరీ పాలనకు వ్యతిరేకంగా ప్రజలు నిరసనలు చేపట్టారు.. ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించాలని డిమాండ్‌ చేస్తూ రాజధానిలో నిరసనకారులు బైఠాయించారు.101లో 40 మంది మృతదేహాలు నైలునదిలో లభించాయి. దీంతో సుడాన్ లో ఉద్రిక్తతలు మరింతగా పెరిగాయి.