మక్కల్‌ నీది మయ్యం పార్టీ అధ్యక్షుడు కమల్‌హాసన్‌పై కేసు నమోదు..!

చెన్నై: సినీ నటుడు, మక్కల్‌ నీది మయ్యం (ఎమ్‌ఎన్‌ఎమ్‌) పార్టీ అధ్యక్షుడు కమల్‌హాసన్‌పై పోలీసులు మంగళవారం ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. తమిళనాడులో అరవకురిచ్చిలో ఈనెల 12న ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న కమల్‌ ”గాంధీ విగ్రహం ఎదుట నిలుచుని మాట్లాడుతున్నా.. స్వాతంత్య్ర భారత్‌లో తొలి తీవ్రవాది ఒక హిందువు. అతని పేరు నాథూరాం గాడ్సే” అని వ్యాఖ్యానించారు. దీంతో ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నం చేశారన్న కారణంతో ఐపీసీలోని పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లు కరూర్‌ జిల్లా పోలీసులు తెలిపారు.

ఆయన వ్యాఖ్యలకు నిరసనగా రాష్ట్రంలో పలు చోట్ల హిందూ సంఘాలు నిరసన వ్యక్తం చేశాయి. ఈ నేపథ్యంలో పోలీసులు చెన్నై ఆళ్వార్‌పేట, ఈసీఆర్‌ రోడ్డులోని కమల్‌ నివాసాలు, పార్టీ కార్యాలయం వద్ద భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. మత విద్వేషాలను రెచ్చగొట్టడం ద్వారా ఎన్నికల నిబంధనలను అతిక్రమించిన ఎమ్‌ఎన్‌ఎమ్‌ పార్టీ గుర్తింపును రద్దు చేయాలని, ఎన్నికల ప్రచారంలో పాల్గొనకుండా కమల్‌పై నిషేధం విధించాలంటూ భాజపా తరఫున న్యాయవాది అశ్వనీకుమార్‌ దిల్లీ హైకోర్టులో మంగళవారం పిల్‌ దాఖలు చేశారు. కమల్‌ వ్యాఖ్యలను భాజపా, అన్నాడీఎంకే తీవ్రంగా ఖండించగా.. డీఎంకే, కాంగ్రెస్‌లోని కొంతమంది నాయకులు ఆయనకు మద్దతుగా నిలిచారు.