అభినందన్ కు రాజస్థాన్ రాష్ట్రంలోని సూరత్‌ఘడ్ ఎయిర్‌ ఫోర్స్ బేస్‌లో పోస్టింగ్ ..!

జైపూర్ : బాలాకోట్ వైమానిక దాడుల అనంతరం పాక్ ఆర్మీ చెరలో చిక్కి, 60 గంటలు గడిపి విడుదలై స్వదేశానికి తిరిగివచ్చిన వింగ్ కమాండర్ అభినందన్ వర్థమాన్ కు ఎట్టకేలకు పోస్టింగ్ లభించింది. ఎన్నో వైద్య పరీక్షల అనంతరం వైమానిక దళాధికారులు అభినందన్ కు రాజస్థాన్ రాష్ట్రంలోని సూరత్‌ఘడ్ ఎయిర్‌ ఫోర్స్ బేస్‌లో పోస్టింగ్ ఇచ్చారు. గతంలో రాజస్థాన్ రాష్ట్రంలోని బికనేర్‌లో సేవలందించిన అభినందన్ సూరత్‌ఘడ్ వైమానిక కేంద్రంలో పదవీ బాధ్యతలు స్వీకరించారని సమాచారం. కాగా రక్షణ రంగంలో అధికారుల పోస్టింగులన్నీ రహస్యంగా ఉంచుతామని అంటూనే అభినందన్ కు మాత్రం రాజస్థాన్ రాష్ట్రంలోనే పోస్టింగ్ ఇచ్చామని వైమానిక దళాధికారి ఒకరు వెల్లడించారు. సూరత్‌ఘడ్ ఎయిర్ ఫోర్స్ బేస్ లో అభినందన్ మిగ్ 21 యుద్ధ విమానం నడుపుతారా లేదా అనేది ఇంకా ధ్రువీకరించలేదు. ఒకసారి యుద్ధ విమానం నడుపుతూ విఫలమైతే మళ్లీ ఆ పైలెట్ కు విమానం నడిపే అవకాశం ఇవ్వరు. కాని అభినందన్ విషయంలో వైమానిక దళాధికారులు ప్రత్యేక కేసుగా పరిగణిస్తున్నారని వాయుసేన వర్గాలు చెపుతున్నాయి. మొత్తంమీద పాక్ నుంచి విడుదలయ్యాక అభినందన్ కు ఢిల్లీ సైనిక ఆసుపత్రిలో చికిత్స అనంతరం ఎట్టకేలకు పోస్టింగ్ ఇచ్చారు.