యుద్ధవిమానాలను నడపనున్నవింగ్ కమాండర్ అభినందన్..

ఢిల్లీ: అభినందన్ వర్థమాన్… ఈ పేరు తెలియని భారతీయుడు ఉండరు. పుల్వామా దాడుల తర్వాత పాకిస్తాన్ యుద్ధ విమానాలు భారత గగనతలంలోకి వచ్చిన సమయంలో వాటిని వెంటాడుతూ వెళ్లి పాక్ సైన్యానికి పట్టుబడిన సంగతి తెలసిందే. అయితే 48 గంటల తర్వాత అభినందన్ వర్థమాన్‌ను పాక్ విడుదల చేసింది.ఇక అప్పటి నుంచి పలు వైద్యపరీక్షలకు హాజరయ్యారు. ఇక త్వరలో తిరిగి ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌లో చేరుతారనే వార్తలు వచ్చాయి. అయితే కొన్ని అనుమతులు ఇంకా రావాల్సి ఉండగా అభినందన్‌ వేచిచూడాల్సి వచ్చింది.

తాజాగా ఈ 35 ఏళ్ల వింగ్ కమాండర్ అభినందన్ త్వరలో జెట్ ఫైటర్లకు కమాడింగ్ చేస్తారని తెలుస్తోంది. అయితే ఇందుకు బెంగళూరులోని ఇన్స్‌టిట్యూట్ ఆఫ్ ఎయిరో స్పేస్ మెడిసిన్‌లో పలు వైద్యపరీక్షలకు హాజరుకావాల్సి ఉంటుందని ఇద్దరు వాయుసేన అధికారులు తెలిపారు. పాకిస్తాన్ ఎఫ్-16 యుద్ధ విమానంను కూల్చి వర్ధమాన్ ఓ చరిత్ర సృష్టించారు. ఆ తర్వాతే తాను నడుపుతున్న మిగ్ -21 యుద్ధ విమానంను పాక్ వాయుసేన కూల్చింది. అయితే సురక్షితంగా బయటపడ్డాడు అభినందన్. అయితే పాక్ భూభాగంలో ల్యాండ్ అవడంతో అతన్ని పాక్ సైన్యం పట్టుకుంది. ఇక మిగ్ 21 బైసన్‌తో ఎఫ్-16 యుద్ధ విమానంను కూల్చడం సాధారణ విషయం కాదని తొలిసారిగా అభినందన్ కూల్చి సరికొత్త చరిత్ర సృష్టించారని భారత వాయుసేన ప్రశంసించింది. అంతేకాదు అభినందన్ పేరును వీర్ చక్ర అవార్డుకు ప్రతిపాదించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

పుల్వామా దాడులకు ప్రతీకారచర్యలో భాగంగా పాకిస్తాన్ లోని బాలాకోట్‌లో ఉగ్రవాద శిబిరాలపై భారతవాయుసేన మెరుపు దాడి చేసింది. ఆ తర్వాత పాకిస్తాన్ యుద్ధ విమానాలు భారత్‌పై దాడి చేసేందుకు భారత గగనతలంలోకి దూసుకొచ్చాయి. భారత్ పాక్‌కు జరిగిన డాగ్ ఫైట్‌లో అభినందన్ వర్థమాన్ పాక్ యుద్ధ విమానంను కూల్చేశాడు. దురదృష్టవశాత్తు ఆయన కమాండింగ్ చేస్తున్న యుద్ధ విమానం కూడా కూలిపోయింది. అయితే అంత ఎత్తునుంచి కిందకు దిగడంతో అభినందన్‌ పక్కటెముకలు, వెన్నెముకలకు గాయాలైనట్లు మెడికల్ టెస్టుల్లో బయటపడ్డాయి. ఇలాంటి సందర్భాల్లో పైలట్లను 12 వారాల పాటు పర్యవేక్షణలో ఉంచుతారు. అన్నీ ఓకే అనుకుంటేనే తిరిగి యుద్ధ విమానాలను నడిపే అవకాశమిస్తారు. ప్రస్తుతం అభినందన్ తన శ్రీనగర్ యూనిట్‌లో రిపోర్ట్ చేసినట్లు అధికారులు తెలిపారు. అంతకుముందు నాలుగు వారాల పాటు మెడికల్ లీవ్ పై అభినందన్ వెళ్లారు.