తులాభారంలో గాయపడ్డ శశిథరూర్‌

తిరువనంతపురం: కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, ఎంపీ శశిథరూర్‌ గాయపడ్డారు. విషు పర్వదినం సందర్భంగా స్థానిక ఆలయంలో శశిథరూర్‌కు తులాభారం నిర్వహిస్తుండగా ఒక్కసారిగా త్రాసు తెగింది. దీంతో ఆయన కిందపడిపోయారు.

కేరళ నూతన సంవత్సరాది విషు పండగను పురస్కరించుకుని తంపనూర్‌ ప్రాంతంలోని గాంధారి అమ్మన్‌ కోవిళ్‌ ఆలయాన్ని శశిథరూర్‌ సోమవారం సందర్శించారు. ప్రత్యేక పూజల అనంతరం ఆలయ ప్రాంగణంలో తులాభారం నిర్వహిస్తుండగా..శశిథరూర్‌ కూర్చున్న త్రాసు ఒక్కసారిగా తెగి కిందపడింది. ఈ ఘటనలో ఆయన కాలికి, తలకు గాయమైంది. వెంటనే ఆయనను సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. థరూర్‌ తలకు ఆరు కుట్లు పడ్డాయని, ప్రస్తుతం ఆయన క్షేమంగా ఉన్నారని వైద్యులు వెల్లడించారు.

తిరువనంతపురం లోక్‌సభ నియోజకవర్గం నుంచి ఇప్పటికే వరుసగా రెండు సార్లు గెలిచిన శశిథరూర్‌.. వచ్చే ఎన్నికల్లోనూ మరోసారి ఇదే స్థానం నుంచి బరిలోకి దిగారు. ఈ ఎన్నికల్లో భాజపా అభ్యర్థి కుమ్మనం రాజశేఖరన్‌, సీపీఎం నేతృత్వంలోని ఎల్‌డీఎఫ్‌ అభ్యర్థి దివకరణ్‌తో ఆయన పోటీపడనున్నారు. కేరళలో ఏప్రిల్‌ 23న లోక్‌సభ ఎన్నికలు జరగనున్నాయి.