అడ్డంగా బుక్కైన జీవీఎల్!

సార్వత్రిక ఎన్నికల హడావుడి మొదలవడానికి ముందు నుంచే ఈవీఎం పనితీరుపై విపక్షాలు అనుమానాలు వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా ఏపీ సీఎం చంద్రబాబు ఈవీఎం లోపాలపై పోరాడుతున్నారు. ఏపీలో పోలింగ్ ముగిశాక ఆయన పోరాటాన్ని మరింత ఉదృతం చేశారు. అయితే బీజేపీ మాత్రం చంద్రబాబు ఆరోపణల్లో నిజం లేదని కొట్టిపారేస్తోంది. ఇక బీజేపీ నేత జీవీఎల్ నరసింహారావు అయితే చంద్రబాబు మీద విమర్శలు దాడి చేస్తున్నారు. కానీ జీవీఎల్ అక్కడే పప్పులో కాలేశారు. తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నారు. జీవీఎల్ గతాన్ని మర్చిపోయినట్టున్నారు. ఎందుకంటే ఒకప్పుడు ఆయన కూడా ఈవీఎంలపై పోరాడిన వ్యక్తే. ‘డెమెక్రసీ ఎట్ రిస్క్’ అనే పేరుతో.. ఈవీఎంల వల్ల ప్రజాస్వామ్యం ఎలా ప్రమాదంలో పడిందని వివరిస్తూ ఏకంగా ఒక పుస్తకమే రాశారు. ఈ పుస్తకంలో ఈవీఎంలను ఎంత ఈజీగా హ్యాక్ చేయవచ్చో స్పష్టంగా వివరించారు.

ఈ పుస్తకంలో పదహారు చాప్టర్లు ఉంటే ఆ పదహారు కూడా ఈవీఎంలు ఏ కోణంలోనూ ఎన్నికలకు పనికి రావని నిర్ధారించారు. చివరికి అసలు అవి రాజ్యాంగబద్ధమైనవి కావని తీర్మానించారు. ఇందులో కీలకమైన విషయం ఏమిటంటే.. ఈవీఎంలను హ్యాక్ చేయవచ్చని నిరూపించిన హరికృష్ణ ప్రసాద్ అనే టెక్నికల్ ఎక్స్‌పర్ట్ జీవీఎల్‌కు చెందిన సంస్థకు టెక్నికల్ కోఆర్డినేటర్ గా ఉన్నారు. ఆయన గతంలో హ్యాక్ చేసి చూపించారు. ఈసీతో ఈయన వాదనను పుస్తకంలో ప్రత్యేకంగా ప్రచురించారు. ఇంకో ట్విస్ట్ ఏంటంటే దీనిలో చంద్రబాబు, ఎల్‌కే అద్వానీల అభిప్రాయాలను తీసుకుని మరీ ప్రచురించారు.

అప్పుడు జీవీఎల్ ఈవీఎంల కరెక్ట్ కాదని పుస్తకం రాశారు. చంద్రబాబుతో అభిప్రాయాన్ని రాయించారు. హరికృష్ణ ప్రసాద్ వాదనను ప్రచురించారు. కానీ ఇప్పుడు అదే జీవీఎల్.. ఈవీఎంలపై ప్రజలకు లేని అనుమానాలు మీకెందుకు? అంటూ చంద్రబాబుపై విమర్శలు చేస్తున్నారు. హరికృష్ణ ప్రసాద్ పై నిందలు వేస్తున్నారు. దీంతో జీవీఎల్ తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జీవీఎల్ విమర్శలు చేసే ముందు.. తాను రాసిన పుస్తకంపై వివరణ ఇవ్వాలన్న డిమాండ్లు వినిపిస్తున్నాయి. గతంలో ఈవీఎంలను వ్యతిరేకించిన జీవీఎల్.. ఇప్పుడు తమ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు సమర్దిస్తున్నారంటే ఎలా అర్థం చేసుకోవాలని పలువురు నిలదీస్తున్నారు. మరి ఈ విషయంపై జీవీఎల్ ఎలా స్పందిస్తారో చూడాలి.