ప్రధాని మోదీపై పోటీకి సిద్ధమైన ప్రియాంకా గాంధీ!

ప్రధాని నరేంద్ర మోదీ సిట్టింగ్ ఎంపీగా వున్న వారణాసి నుంచి రానున్న లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి, ఉత్తర్ ప్రదేశ్ తూర్పు ఇంచార్జ్ ప్రియాంకా గాంధీ వాద్రా పోటీకి సిద్ధమైనట్టు తెలుస్తోంది. విశ్వసనీయవర్గాలు శనివారం జీ న్యూస్‌కి తెలిపిన వివరాల ప్రకారం ఆమె వారణాసి లోక్ సభ స్థానం నుంచి పోటీ చేసేందుకు ఉత్సాహం ప్రదర్శిస్తున్నట్టు సమాచారం. అయితే, దీనిపై పార్టీ వర్గాల నుంచి ఇంకా ఎటువంటి అధికారిక ప్రకటన వెలువడకపోవడం గమనార్హం. 

గత నెల్లోనే ఓ ఎన్నికల క్యాంపెయిన్‌లో పాల్గొన్న ప్రియాంకా గాంధీ వాద్రాను రాయ్‌బరేలి లేదా అమేథి స్థానాల నుంచి పోటీచేయాల్సిందిగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కోరగా వారణాసి నుంచి ఎందుకు చేయకూడదని ప్రశ్నించారామె. సరిగ్గా ప్రియాంకా గాంధీ వాద్రా చూపిన ఈ ఉత్సాహమే ఆమెను ఆ దిశగా అడుగులేపిస్తోందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఏదేమైనా అంతిమ నిర్ణయం మాత్రం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీదే అయ్యుంటుందనే సంగతి తెలిసిందే.