‘నేను అన్నా అంటే… నన్ను అవమానించారు’జయప్రద

ప్రముఖ నటి, మాజీ ఎంపీ జయప్రద మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాజాగా బీజేపీలో చేరిన జయప్రద యూపీలోని రాంపూర్ నుంచి లోక్‌సభ ఎన్నికల బరిలోకి దిగారు. ఈ సందర్భంగా ఆమె జోరుగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా సమాజ్‌వాదీ పార్టీ నేత ఆజాంఖాన్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆజాం ఖాన్‌ను అన్నా అని పిలిస్తే… ఆయన మాత్రం తనను నాట్యగత్తె అంటూ కామెంట్ చేశారని జయప్రద ఆవేదన వ్యక్తం చేశారు.

2004లో సమాజ్‌వాదీ పార్టీ తరపున రాంపూర్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి పోటీచేసి గెలుపొందిన జయప్రద… ఆజం ఖాన్ తీరుతో ఆమె పార్టీకి దూరమయ్యారు. గత కొన్ని రోజులుగా ఆమె విమర్శలు గుప్పిస్తున్నారు. ‘ఆజం ఖాన్‌… నేను నిన్ను అన్నా అని పిలిచాను. కానీ నువ్వు నన్ను అవమానించావు. నన్ను డాన్సర్ అన్నావు. నిజమైన సోదరులుఎవరూ అలా మాట్లాడరు. నీమాటలు నన్ను ఎంతో బాధించాయి. అందుకే నేను రాంపూర్ విడిచి వెళ్లాను’ అంటూ ఆవేదన వ్యక్తం చేశారు జయప్రద.

గతంలో తనను ఆజం ఖాన్ తీవ్ర ఇబ్బందులకు గురిచేశారని జయప్రద ఎప్పటికప్పుడు ఆరోపణలు చేస్తూ వస్తున్నారు. తాజాగా కూడా మరోసారి సెంటిమెంట్‌తో కూడిన వ్యాఖ్యలు చేశారీ సినీ నటి. మరి ఎన్నికల వేళ జయప్రద పొలిటికల్ సెంటిమెంట్ ఎంత వరకు వర్కవుట్ అవుతుందో వేచి చూడాలి.