చైనా కెమికల్ కంపెనీలో భారీ అగ్ని ప్రమాదం.. 44మంది మృతి

బీజింగ్‌ : చైనాలోని జియాంగ్జు ప్రావిన్స్‌లో ఘోర ప్రమాదం జరిగింది. యాంచెంగ్‌లోని టియాంజాయి కెమికల్ ప్లాంట్‌లో గురువారం భారీ పేలుడు సంభవించింది. ఈ పేలుడు ధాటికి పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి. దట్టమైన నల్లని పొగలు కమ్ముకున్నాయి. ఈ ప్రమాదంలో 44 మంది చనిపోగా.. సుమారు 640 మందికిపైగా తీవ్రంగా గాయపడ్డారని, క్షతగాత్రులను ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నట్లు స్థానిక మీడియా పేర్కొంది. అందులో కొంతమంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిపింది.

పేలుడు తీవ్రతకు కెమికల్ ప్లాంట్ చుట్టుపక్కల ఉన్న ఇళ్లు దెబ్బతిన్నాయి. ఎరువులు తయారు చేసే ఫ్యాక్టరీలో మంటలు చెలరేగడం వల్లే పేలుడు సంభవించినట్లు అధికారులు ప్రాథమిక అంచనాకు వచ్చారు. ప్రమాద విషయాన్ని తెలుసుకున్న అధికారులు హుటాహుటిన ఘటనాస్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. భద్రతా ప్రమాణాలు పాటించకపోవడం వల్లే ఈ ప్రమాదం చోటుచేసుకుందని, గతంలో కూడా ఈ విషయంలో కంపెనీకి జరిమానా విధించినట్లు అధికారులు పేర్కొన్నారు. ఘటనపై విచారణ జరుగుతుందన్నారు.