ఓటింగ్‌ను పెంచాలని ప్రముఖులకు మోదీ విజ్ఞప్తి..

ఓటు..ప్రజాస్వామ్యానికి మూలాధారం. అలాంటి ఓటు హక్కును ప్రతి భారతీయుడు వినియోగించుకోవాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అభ్యర్థిస్తున్నారు. సార్వత్రిక ఎన్నికలు దగ్గరపడుతున్న సమయంలో ఓటు హక్కుపై ప్రతి ఒక్కరికీ అవగాహన కల్పించి, ఎన్నికల్లో ఓట్ల శాతాన్ని పెంచేలా చూడాలని రాజకీయ, సినీ, క్రీడా ప్రముఖులకు మోదీ విజ్ఞప్తి చేశారు. కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ, పశ్చిమ్‌బంగా, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రులు మమతా బెనర్జీ, కేసీఆర్‌, చంద్రబాబు సహా ట్విటర్‌ వేదికగా ప్రతి ఒక్కరినీ పేరుపేరునా అభ్యర్థించారు.
వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో ఓటింగ్‌ శాతాన్ని పెంచేలా ఓటర్లను ప్రోత్సహించాలని రాహుల్‌గాంధీ, మమతాబెనర్జీ, శరద్‌ పవార్‌, మాయావతి, అఖిలేశ్‌ యాదవ్‌, తేజస్వీ యాదవ్‌, స్టాలిన్‌ తదితరులను కోరుతున్నా. దేశవ్యాప్తంగా ఓటరు అవగాహన కార్యక్రమాలను పెంచాలి. రాష్ట్రాల్లో పోలింగ్‌ బూత్‌లకు ఎక్కువ మంది వచ్చేలా కృషి చేయాలని కేసీఆర్‌, నవీన్‌ పట్నాయక్‌, కుమారస్వామి, చంద్రబాబు, జగన్‌, నితీశ్‌ కుమార్‌ తదితరులను కోరుతున్నా అని మోదీ వరుస ట్వీట్లలో పేర్కొన్నారు.
అలాగే నాగార్జున, షట్లర్లు సైనా నెహ్వాల్‌, పీవీ సింధు, కిదాంబి శ్రీకాంత్‌, క్రీడా ప్రముఖులు సచిన్‌, వీవీఎస్‌ లక్ష్మణ్‌, వీరేంద్ర సెహ్వాగ్‌, అనిల్‌ కుంబ్లే, క్రికెటర్లు ధోనీ, విరాట్‌ కోహ్లీ, రోహిత్‌ శర్మ, ఫోగట్‌ సోదరీమణులు గీతా, బబిత, విన్నేశ్‌, బాలీవుడ్‌ ప్రముఖులు దీపికా పదుకొణె, ఆలియా భట్‌, అనుష్క శర్మ, అక్షయ్‌ కుమార్‌, సల్మాన్‌ఖాన్‌, ఆమీర్‌ఖాన్‌, అమితాబ్‌ బచ్చన్‌, షారూక్ ఖాన్‌, కరణ్‌ జోహార్‌ తదితరులను మోదీ అభ్యర్థించారు.