కొచ్చర్‌కు చుట్టూ బిగుస్తున్న ఉచ్చు … !

ముంబయి: ఐసీఐసీఐ బ్యాంక్‌ మాజీ సీఈవో చందాకొచ్చర్‌కు మరో తలనొప్పి మొదలైంది. తన భర్త దీపక్‌ కొచ్చర్‌ పై త్వరలోనే ఆదాయపన్ను అధికారులు బినామీ వ్యవహారాల వ్యతిరేక చట్టం కింద దర్యాప్తు ప్రారంభించనున్నారు. గతంలో పన్ను ఎగవేతకు సంబంధించి చేసిన దర్యాప్తులో పెద్దగా పురోగతి లేకపోవడంతో బినామీ వ్యతిరేక చట్టం కింద దర్యాప్తు చేపట్టాలని భావిస్తున్నారు.
గత ఏడాది విచారణ సందర్భంగా దీపక్‌కొచ్చర్‌ను సింగపూర్‌కు చెందిన కంపెనీ ఏడీఎస్‌ఎఫ్‌ తన సబ్సిడరీ డీహెచ్‌ రెనీవబుల్‌ హోల్డింగ్స్‌ ద్వారా పెట్టిన రూ.405 కోట్ల పెట్టుబడులపై వివరాలు ఇచ్చారు. ఈ విచారణ సందర్భంగా అధికారులు కొన్ని లోపాలను గుర్తించారు. మనీలాండరింగ్‌, నగదును వేర్వేరు మార్గాల్లో కంపెనీలోకి తీసుకొచ్చినట్లు అనుమానాలు ఉన్నాయని దర్యాప్తు అధికారులు భావిస్తున్నారు. ఇప్పటికే ఈ నివేదికను ఈడీతో పంచుకొన్నారు.
జరిగింది ఇదీ..
ఆదాయపుపన్ను శాఖ గత ఏడాది ఏప్రిల్‌ 10న దీపక్‌ కొచ్చర్‌కు నోటీసులు జారీ చేసింది. నూపవర్‌లో పెట్టుబడులు పెట్టిన ఏడీఎస్‌ఎఫ్‌ సబ్సిడరీ కంపెనీల గురించి విచారించారు. ఈ కంపెనీలు పెట్టుబడి పెట్టిన సొమ్మకు మూలాలను అధికారులు ప్రశ్నించారు. ఈ రెండు సంస్థలు అత్యధిక ప్రీమియంతో నూపవర్‌లో వాటాలను కొనుగోలు చేశాయి. దీనికి సంబంధించి ఇప్పటికే ఐటీ శాఖ సింగపూర్‌ కంపెనీలకు నోటీసులు జారీ చేశాయి. సాధారణంగా నిధుల బదలాయింపు కోసమే ఉద్దేశపూర్వకంగా అధిక ప్రీమియం చెల్లించి వాటాలు కొనుగోలు చేసినట్లు ఐటీశాఖ నమ్ముతోంది. దీంతో ఏడీఎస్‌ఎఫ్‌కు చెందిన వార్షిక నివేదిక, బ్యాలెన్స్‌ షీట్‌, పన్ను వివరాలు, ప్రమోటర్లు, వాటాదారులు వివరాలను , మారిన షేర్‌ హోల్డింగ్‌ ప్యాట్రన్‌ను వెల్లడించాలని కోరింది.